Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 27

ఆ కాలమున మద్రాసులో నాయుడుగారు ఆంధ్రులలో ప్రముఖులుగ నుండిరి. ఆంధ్రమున గంభీరమగు ఉపన్యాసముల నిచ్చుచుండిరి. చెన్నపురిలో ఆ కాలమున నాయుడుగారు మాట్లాడని సభ ఉండెడిది కాదు. వీరు మొదట ఆంధ్రమున ఉపన్యాసమును ప్రారంభించి, అరవములో ముగింతురు. సభలో మహమ్మదీయులు, మళయాళీలుండిన వారి భాషలలో మాట్లాడి అందరిని నవ్వించుచుండిరి. వీరు బక్కపల్చగ నుందురు. అంటి అంటని తిరుమణి శ్రీచూర్ణమును ముఖమున దిద్దువారు; నవ్వు ముఖము, తెల్లని తలపాగా, లాంగుకోటును ధరించువారు. సరసులు. తెలుగు పండితులు; చక్కని వాగ్ధోరణి గలవారు. ఆ రోజులలో వీరు గొప్ప కాంగ్రెసువాదులు. ఆ నాడు జరిగిన ఈ సన్నివేశమంతయు ఈ నాడు నా కంటికి కనపడుచున్నట్లేయున్నది.

నేను ఆనాడు పత్రికలో ప్రచురించుటకు వారివద్ద యిచ్చిన అడ్వర్టయిజుమెంటు యేమనగా :

మందగమన - సుందరాంగి అను ఇరువురు చెలికత్తెల సంభాషణ (స్థలము : నీలాటి రేవుగట్టున బోర్లించిన బిందెలమీద ఇరువురు కూర్చుండిచేసిన సంభాషణ)

మందగమన : ఏమే, సుందరీ! ఈమధ్య నీవు నాకు అగుపడుటయే లేదేమే?

సుందరాంగి ; ఏమి చెప్పుదునే అక్కయ్యా నా అవస్త? నా మగడు నన్ను చూచినప్పుడెల్లను కారాలు మిరియాలు నూరుతుంటారు. చీటికి మాటికి వీపు బద్దలయ్యేటట్టుగా బాదుతారు. నాతో మాట్లాడరు. ఇంట పరుండరు. ఈ నా అవస్థలో నిన్ను నేను యెట్లు చూడగల్గుదును?