చిన్ననాటి ముచ్చట్లు 15
వీరికి వేపుడుకూరలు, కోరిన పచ్చళ్లు, ఆవకాయ, ఊరగాయ వగైరాలు - ఇవి కలుపుకొన్నపుడెల్లా ముద్దముద్దకు చారెడేసి కమ్మనినేయి - ఈ విపరీతపు ఖర్చుకు తట్టుకోలేక పోయినది. ఆమె వీరిని భరించజాలక హోటలు ముగించి తలుపు మూసినది.
క్రమముగా ఆంధ్ర విద్యార్థులు మద్రాసులో విస్తారమైనారు. కొందరు విద్యార్థులు భోజనమునకై ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడ కాపురములే పెట్టకొనసాగినారు. అయితే ఆంధ్రులకు అరవలుండు ఇండ్లలో కాపురమునకు స్థలము చిక్కుట దుర్లభమైనది. ఏలనంటే ఆంధ్రులకు ఆచారము లేదు; మగవారు చుట్టలు త్రాగుచు ఎక్కడ పట్టిన అక్కడ ఇల్లంతా ఉమ్మివేయుచుందురు; బిడ్డలు ఇల్లంతయు చెరిచెదరు; సాధారణముగా స్నానము చేయరు - అని అరవవారికి వీరియందొక అపోహ. ఇది కేవలము అపోహయే కాదేమో!
సరిగా నిట్టి సమయంలో వంగవోలునుండి కొండపి రామకృష్ణా రావు, గొట్టెపాటి చెంచు సుబ్బారాయుడుగార్లనే వారిరువురు మద్రాసుకు కాలేజీ విద్యకై వచ్చిరి. ఈ చెంచు సుబ్బారాయుడుగారు హైకోర్టు జడ్డీ గౌరవనీయులగు శ్రీ చింతగుంట రాఘవరావుగారి మామగారు. చెంచు సుబ్బారాయుడుగారు చాలా ఆచారవంతులు. కాఫీ పుచ్చుకొనేవారు కారు; చిరుతిండ్లు తినేవారు కారు; శివార్చన చేయనిది భుజించేది లేదు: సత్యవంతుడు. ఇట్టివారికి నగరంలో భోజనవసతి దొరకుట కష్టసాధ్యము. వీరిరువురు మా ప్రాంతమువారగుటచే కాబోలు ఎట్లో నన్ను తెలిసి కలుసుకొన్నారు. ఎట్లైనా తమకు భోజనవసతి ఏర్పాటు చేయమని గట్టిగా కోరినారు. నేను అప్పడు నా తల్లితో యోచించి, ఆమె చేయుచున్న వంటకొల్వును మాన్పించి, వీరిరువురికిని ఆచారముగ అన్నము వండిపెట్టు