పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14 చిన్ననాటి ముచ్చట్లు

వంటచేయుట కారంభించినది. అందుకు వారామెకు నెలకు రూ.5 లు ఇచ్చేవారు. ఈ విధముగా ఇరువురము కలిసి రూ. 10 లు తెచ్చుకొనుచు కాలము గడుపుచుంటిమి. ఆ కాలమున రూపాయికి బియ్యం 6 పళ్లు మొదలు 8 పళ్ల వరకు ఇచ్చుచుండిరి. సమీపమునయున్న రావిచెట్టు అగ్రహారమున బిక్షమెత్తుకొనే బ్రాహ్మణులు రూపాయకు 8 పళ్ల బియ్యమును అమ్మేవారు. మేము తరుచుగా వారివద్దనే బియ్యం కొనేవారము. ఈ ప్రకారము కొంతకాలము జరిగినది.

ఆ కాలమున కాలేజీలో చదువుకొనే విద్యార్థులకు "హాస్టల్స్ లేవు. తెలుగువారికి అరవహోటలు భోజనము సరిపడేది కాదు. అందువల్ల ఆంధ్రులు ఎక్కడనైనా ఒక్క రూమును చదువుకొనుటకు అద్దెకు తీసుకొని సామాన్య గృహస్థుల ఇండ్లలో డబ్బిచ్చి భోజనము చేసి చదువు కొనుచుండేవారు.

ఆ రోజులలో టంకసాల వీధిలో కాశీపాటి (వారింటిపేరు కాశీవారు; ఆమెను - పాటి అనగా అరవంలో అవ్వా అనేవారు) హోటలులో కంది పచ్చడి, వేపుడు కూరలు వడ్డించేవారు. అందువల్ల కొందరాంధ్రులు అక్కడ చేరసాగినారు. ఈ హోటలులో అరవలు, ఆంధ్రులు కలిసి యుండుటవల్ల భోజనపదార్ధములలో పేచీ వచ్చి, ప్రతిదినము పిల్లకాయలు దెబ్బలాడుకొనుచుండేవారు. ఇందువల్ల ఆమె తెలుగువారిని తన హోటలుకు రావద్దని వెళ్ళగొట్టినది.

ఆ సమయంలోనే అమ్మాయమ్మయను తెలుగుఆవిడ తెలుగువారికి ప్రత్యేకంగా హోటలుపెట్టి, తెలుగువారికి సరిపడు వంటకములను చేసి, పిల్లకాయలను తృప్తిపరచుచుండెను. ఆ కాలమున హోటలుకు నెలకు రూ. 7లు మొదలు రూ. 10 లు వరకు ఇవ్వవలసియుండెడిది. అమ్మాయమ్మయు తెలుగువారివద్ద రూ. 10 లు వసూలు చేసెడిది. కాని