Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16 చిన్ననాటి ముచ్చట్లు

ఏర్పాటు చేసినాను. మేము అగ్రహారములో పెద్దగదిని అద్దెకు పుచ్చుకున్నాము. మా తల్లి అనుకున్న ప్రకారము వీరిరువురికిని వంటచేసి పెట్టుచు వచ్చినది. చెంచు సుబ్బారాయుడు గారికి ఆచారమే గాకుండా కొన్ని భోజన నియమములు కూడ యున్నవి. ఈ ఊరి కాయగూరలను తింటే ఏమేమో జబ్బులు వస్తవి అని వారి భయము. అందువల్ల ఇంటినుండి చింతపండు పచ్చడిని, ధనియాలపొడిని తెప్పించుకొని వాటితోను చారు మజ్జిగలతోను భుజించుచుండెడివారు. పండుగనాడుకూడా వారికదే భోజనం. చదువుకొనుటకు వారు యేర్పాటు చేసుకున్న రూముకు రాత్రిళ్ళు నేను గూడ వెళ్ళి వారికి తోడుగ పడుకొనేవాడను. ఈ కారణమువల్ల వారికి నాకు మంచిస్నేహము కుదిరినది. వీరితో కూడ యుండిన కొండపి రామకృష్ణరావుగారున్ను చాలా పెద్ద మనుష్యులు. వారిరువురితో నేను చాలా చనువుగా ఉండేవాడను.

ఇట్లుండగా నా తల్లి అకస్మాత్తుగా చనిపోయినది. మద్రాసులో నేను మరల ఏకాకినైనాను. నాకు భోజనమునకే కరవైనది. అయితే ఈసారి నాకు మరి ఇరువురు తోడైనారు. మాయింట్లో భోజనము చేయుచుండిన విద్యార్థులకు కూడ భోజనవసతి తప్పిపోయినది. మేము ముగ్గురమును చాల కష్టపడవలసి వచ్చినది. కాని దైవమొక దారి చూపినాడు.

మేముండే ఇంటిలోనే జొన్నలగడ్డ నరసమ్మ అనే ఆమె కాపురమున్నది. ఆమెను నేనాశ్రయించి వారిరువురికిని భోజనము వండిపెట్టుటకు వప్పించితిని, నరసమ్మ సమ్మతించుచు, మరి ఎవరినైనా కొంతమందిని కూడా కుదిర్చిన బాగుండుననెను. అప్పడు నేను కావలి కాపురస్తులగు విస్సా రామారావుగారిని, వెన్నెలకంటి కృష్ణస్వామి రావుగారిని, ఓరుగంటి వెంకటసుబ్బయ్యగారిని జతగూర్చితిని. అప్పడది యొక చిన్న