Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు191

వచ్చిచేరిన పేదబ్రాహ్మణులు. వారందరు పౌరోహిత్యము చేసియో, లేక బిచ్చమెత్తుకొనియో జీవించేవారు. నేనున్నూ ఆ జట్టుతో చేరి వారి వలెనే జీవిత మారంభించినాను. ఆ కాలంలో చెన్నపురియందు బ్రాహ్మణులకు అన్నంపెట్టే ధర్మసత్రములు చాలా ఉండేవి. అయితే వాటిలో ఒకపూటే అన్నం పెడతారు. ఆ ఒకపూట తిని, ఉండడానికి ఇల్లులేని కారణమున, రావిచెట్టు క్రిందనే పడుకునేవాడిని. పసివాడను కావడంచేత రాత్రి ఆకలి వేసేది. ఒక్కొక్కరోజు ఆ ఆకలి తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడు ప్రక్కనున్న కొత్వాల్ చావడికి వెళ్లితే, అక్కడ మొక్కజొన్న పేలాలు పడి రెండు దమ్మిడీలకు ఇచ్చేవారు. ఒక్క దమ్మిడీపెట్టి - అరపడి పేలాలు కొనుక్కొని తిని మంచినీళ్లు త్రాగి, రావిచెట్టు క్రిందికి తిరిగీ చేరి నిద్రపోయేవాడిని. ఈవిధంగా చెన్నపట్నంలో రావిచెట్టుక్రింద కాపురం కొన్నాళ్లు సాగించినాను. ఆ బ్రతుకు అసహ్యంగా తోచి చదువుకొందాము - అనే ధ్యాస కలిగింది.

పచ్చయప్ప కాలేజీ భవనానికి (జార్జిటవున్లో) ప్రక్కన బందరు వీధి అనియొక వీధి ఉన్నది. ఆ వీధిలో - రామానుజాచారిగారని యొకరు, వీధి బడి పెట్టుకొని చిన్నపిల్లలకు చదువులు చెప్పేవారు. పిల్లల తలిదండ్రులవద్ద జీతాలు పుచ్చుకొనేవారు. విద్యాతురుడనైన నేను తిన్నగా వారి నాశ్రయించి, జీతము లేకుండా చదువుచెప్పేటట్టు, వారి అనుగ్రహం పొందినాను. వారి అనుగ్రహం పొందిన విద్యార్థిని కావడంచేత వారి ఇంటికి వెళ్లి, వారికి శుశ్రూష చేసేవాడిని. వారు నాయందు దయగలిగి చనువుతో నాచేత కాళ్లు పట్టించుకొనేవారు; ఇతరమైన ఇంటి పనులు చేయించుకొనేవారు. నాయందనుగ్రహించి ఉచితంగా విద్యాదానం చేసే గురువునకు అరమరికలు లేకుండా సపర్యలు చేసేవాడను. వారి వద్దనే రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షము మొదలైన పద్యకావ్యములు ఆర్థసహితంగా చదువుకొన్నాను. కాని