192 చిన్ననాటి ముచ్చట్లు
చూచేకొద్దీ ఈ చదువు, బ్రతుకు తెరువుకు పనికిరాదని తోచినది. ప్రైవేటుగా నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్వసాగినాను. ఇంగ్లీషు విద్యపై మనసు కలిగినది.
1889-లో టంకసాల వీధిలో శ్రీ సచ్చిదానంద యోగి రామనాథ శివశంకర పాండ్యాగారు, హిందూ థియొలాజికల్ హైస్కూలు స్థాపించి, ప్రధానాధ్యాపకులై నడిపింపనారంభించినారు. 1888లో క్రిస్టియన్ కళాశాలలో నొక ఆంగ్లేయాధ్యాపకుడు హిందూ మతమును దూషణ పూర్వకముగా అపహాస్యం చేయుటచే నాటి హిందువులలో అలజడి బయలుదేరింది. కొత్తగా వచ్చివ ఆంగ్ల విద్య నేర్చుటతోపాటు బిడ్డలు మతాంతరులు అవుతారనే భయము కలిగినది. దాని ఫలితంగా నీ హిందూథియలాజికల్ హైస్కూలు ఏర్పడినది. శ్రీపాండ్యాగారు సంస్కృతాంధ్ర ఆంగ్లభాషా కోవిదులు; ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. ప్యాసైనవారు, దైవచింత గలవారు; వారి నాశ్రయించి తిన్నగా ఆ పాఠశాలలో జీతము లేకుండా చదువుకొనే వసతి (Scholarship) సంపాదించినాను. వారొకనాడు క్లాసుకువచ్చి - విద్యార్థుల రిజిస్టరులో పేరులు చదివి హాజరు వేయుచుండిరి. కె. నరసింహం' అనగానే ఇద్దరము ఆ పేరు గలవారము లేచి నిలచినాము. ఇద్దరికి ఒకే పేరు చిక్కుగా ఉన్నది, అని వారు తలచి - నాయందు చనువుచే నావంకచూచి - 'నీ పేరు అర్థము చెడకుండా కొద్దిగా మారుస్తాను' అన్నారు. నేను సమ్మతించినాను. అంతట - 'కోట నరసింహం' అనే పేరులో 'సింహం' అర్థముగల 'కేసరి' పదమును సింహమునకు బదులుచేర్చి - 'కోట నరకేసరి' అని మార్చిరి. నేను అంగీకరించితిని. అది మొదలు నా మిత్రులందరు నన్నా పేరటనే పిలువ నారంభించిరి. పాండ్యాగారి దయవల్ల జీతమైతే అవసరము లేకపోయిందేగాని, పుస్తకాలకు, గుడ్డలకు, భోజనానికి ఇబ్బంది మాత్రం అట్లాగే ఉన్నది. భోజనానికి కొన్ని ఇండ్లలో వారాలు ఏర్పాటు చేసుకొన్నాను.