అనుబంధము
నా జీవిత వృత్తాంతము
"దేహీతి వచనం కష్టం, నాస్త్రీతి వచనం తధా
దేహీ నాస్తీతి మద్వాక్యం మాభూత్ జన్మని జన్మని."
సోదర సోదరీమణులారా !
ఈ రోజున నా 73వ జన్మదినము. నేను ఈ చెన్నపట్నానికి వచ్చి సుమారు 60 సం||లైనది.
నేను వంగవోలు తాలూకాలో, ఆ పట్నానికి సమీపంగా ఉండే ఇనమనమెళ్ళూరు గ్రామంలో ఒక పేద కుటుంబమునందు, పూరి ఇంట్లో జన్మించినాను. మా యింటిపేరు కోటవారు. మేము వెలనాటి వైదిక బ్రాహ్మణులము. నేను జన్మించిన 5 మాసములకే హఠాత్తుగా మా నాయన గారు కలరా జాడ్యమువల్ల స్వర్గస్థుడైనాడు. జంధ్యాలు వడుక్కుంటూ వచ్చిన టెంకాయ చిప్పలో రూ. 0-10-0లు రొఖం మాత్రం నిలువచేసి వెళ్లిపోయినారు. అదీ నా పిత్రార్జితము. ఆ పిదప మాతల్లి ఎన్నెన్ని కష్టములోపడి 10, 11 సం||లు నన్ను కష్టము తెలయనివ్వకుండా పెంచి పెద్దవానిని చేసినది. నాకు ఊహ తెలిసినది. ఆమె కష్టము చూడలేకపోయినాను. ఒకనాడు మాగ్రామం వదలివెట్టి, కాలి నడకన, దారి మకాములు చేసుకుంటూ చెన్నపట్నం చేరుకున్నాను. ఆ రోజులలో రైళ్ళులేవు. ఎవరైనా బండ్లమీద, బక్కింగ్ హామ్ కాలువపై పడవలలో, లేనిచో కాలినడకతో చెన్నపట్నం రావలసినదే. నాకు కాలినడకే అనుకూలమైనది.
చెన్నపట్నం రాగానే కొత్వాల్ చావడివద్ద రావిచెట్టు అగ్రహారం ప్రవేశించినాను. ఆ అగ్రహారంలో ఉండేవారు పలువురు ఉత్తరాదినుంచి