చిన్ననాటి ముచ్చట్లు 9
వినబడెను. లోపలికి పోయిన జనము బయటికి వచ్చుటకు ప్రయత్నించు చుండిరిగాని, పొగమంటవల్ల కండ్లుగానక దారితప్పి ఒకరిమీద ఒకరు పడుటయు, కాళ్లక్రింద స్త్రీలు బిడ్డలుపడి చితికిపోవుటయు తటస్థించెను. ఆనాటి ప్రదర్శనమునకు గొప్ప యింటివారు చాలామంది వచ్చియుండిరి. వచ్చిన పురుషులు వారి ఆలుబిడ్డలను వెతుకుచు ఒకరినొకరు గుర్తించలేక అగ్నిదేవున కందరు నర్పణమైరి.
అంతటి ఆనందమయమైన ప్రదేశమంతయు నొక్క అరగంట లోపల రుద్రభూమియై పోయినది. లోపలినుండి తప్పించుకొని రాగలిగిన వారిలో కొందరికి గాయములు, కాల్పులు, గ్రుడ్డితనము, ఏర్పడగా ఎట్లో వారు బయట పడిరి. కొందరు మంటలకు తాళజాలక సమీపములో నున్న కూవం నదిలో దూకిరి. వెలగల నగలు, ఇతర విలువైన పదార్ధములు ప్రదర్శించినవారు సొమ్మును విడిచి రాలేక అంగళ్లలోనే కాలిపోయిరి. అట్టి సమయమున చోరీలుకూడా మెండుగా జరిగినవి. మరణించిన బిడ్డల మీదను స్త్రీల మీదను యుండే, వెండి బంగారపు నగలు, వస్త్రములందలి సరిగెలు కరిగి బంగారము, వెండి ముద్దలు గట్టిపోయినవి. ఆ రోజులలో పురుషులును తగు మాత్రము నగలు ధరించేవారు. ఆనాడు అమావాశ్యనాటి నీలి ఆకాశమువలె రుద్రభూమియైయున్న ఆ వినోదప్రదేశమున, ఆ వెండి బంగారపు ముద్దలు నక్షత్రములవలె మిసమిసలాడుచు వెలుగసాగినవి.
ఇంతలో పోలీసువారు వచ్చి నిప్పునార్పు ఇంజన్లతో కాలిన కొరవులను, ఆర్పివైచిరి. ఆరోజులలో చెన్నపట్నంలో చాలినన్ని నిప్పునార్పు యంత్రములు (ఫైర్ ఇంజన్లు) లేవు కావున తెల్లవార్లు ఆ మంటల నార్పవలసి వచ్చినది.