10 చిన్ననాటి ముచ్చట్లు
ఆరోజున నొక మహనీయు డొనర్చిన సేవ వర్ణనాతీతము. ఆయన క్రిస్టియన్ కాలేజీ ప్రిన్సిపాల్ మిల్లరుదొర. ఆయన నేటివారి వంటివారు కారు; పూర్వపు కణ్వ, గౌతమ కాణాదాది కులపతుల తలపించు కరుణార్ధ్ర హృదయుడు. ఆయన స్వయముగా, సాహసించి గుంజలెగబ్రాకి కాలుచున్న పందిళ్లను దులిపివేసినారు. పొగలోనున్న, శిశువులను స్త్రీలను ఇవతలికి తెచ్చి విడిచినారు. ఇంకెన్ని విధములుగానో అచ్చట బాధితులకు సహాయపడినారు. అంతేకాక కాలేజీకి వెళ్లి రిజిస్టరు చేతబుచ్చుకొని పొరుగూరు నుండి విద్యాభ్యాసమునకై వచ్చి, కోనకొక్కడు, గొందికొక్కడుగా నుండిన వారిని పేరుపేరు వరుసన తెలుసుకొని వారి యోగక్షేమములను విచారించి వారి తల్లిదండ్రులకు పోషకులకు తెలియపరచి, వారి ఆత్రము బాపిన శిష్యవత్సలుడగు మహాత్ముడతడు.
ఆ రుద్రభూమి నంతయు పోలీసులెంత కాపలా కాచినను, తెల్లవారేసరికి కరిగి ముద్దలైన వెండి, బంగారములు, వెదజల్లబడిన నవరత్నములు చాలావరకు ఆ నక్షత్రముల వలెనే మటుమాయమై పోయినవి.
ప్రదర్శనమున మంట ఎంత త్వరగా జ్వాలారూపమును దాల్చినదో, అంత త్వరగానే రాణితోట కాలిపోయినదన్న వార్త పట్నమంతా అల్లుకొనినది. మద్రాసులో ఆరోజు విశేష దినమగుటచే చాలా యిండ్లలో నుండి వేడుక చూచుటకు వెళ్లియుండిరి. ప్రదర్శనశాల భస్మమైన సంగతిని వినిన తోడనే వారివారి బంధువుల క్షేమము తెలుసుకొనుటకు వేలకు వేలు జనము వెర్రిత్తినట్టు ఆక్రోశించుచు, ఆ స్థలమునకు పరుగెత్తిరి. నల్లగా గాలి కొరివి దయ్యముల వలె నున్న ఆ శవములను చూచుటకు ఆరాత్రి అధికారులు అవకాశమివ్వరైరి. అందుచే వారి బంధువులందరును ఆరాత్రి అంతయు అక్కడనే యుండవలసి వచ్చినది. తెల్లవారిన పిమ్మట పోలీసువారు