పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8 చిన్ననాటి ముచ్చట్లు

ఆ కాలమున నేను మద్రాసులోనేయుండి చదువుకొనుచుంటిని. నా తల్లి నన్ను చూచిపోవుటకు మద్రాసు వచ్చినది. ఆమె వచ్చిన పిమ్మట కొత్వాలు బజారు సమీపమున యుండు ఆచారప్పన్ వీధి సందులోయున్న ఒక యింటిలో ఒక రూమును నెల 1-కి రూ. 0-12-0 లకు అద్దెకు తీసుకొని ఇరువురము నివసించుచుంటిమి.

అది 1886 అని జ్ఞాపకము. అప్పటికి రాణి తోటలో డిశంబరు వేడుకలు ప్రారంభమై రెండు మూడు సం||లైనది. ఆ సం౹౹ను యథాప్రకారమవి సాగుచున్నవి. ఒకనాటి సాయంకాలము మాయింటిలో కాపురముండే పిల్లవాడును నేనును కలిసి రాణి తోటలోని వేడుకలు చూడ వెళ్లితిమి. నేను మా తల్లితో చెప్పియే వెళ్లితిని. మేమిరువురము సంతోషముతో ఇల్లు విడిచి నడుస్తూ, సాయంకాలం 6 గంటలకు తోటకు చేరితిమి. పిమ్మట కొంతసేపు బయటనున్న రంగులరాట్నమును ఎక్కి గిరగిర తిరిగి ఆనందించితిమి. చుక్కాణిలో కాశీ రామేశ్వరములను చూచి సంతోషించితిమి. ఆవల నాతో వచ్చిన పిల్లవాడు లోనికి పోదాము అని నన్నుకూడ పిలిచినాడు. నావద్ద అర్ధణాలేదని చెప్పితిని. అయితే నాతో వచ్చిన బాలుని వద్ద అర్ధణామాత్రమే యుండెను. అతడు నాయందలి సావాసమున నన్ను విడిచి పోలేక పోలేక లోపలికి పోయెను. అప్పడు నా చేతిలో ఆరు దమ్మిడీలు లేని కారణమున నేను దిగబడి ఉండవలసి వచ్చెను. అర్ధణా మాత్రమే చేతిలో ఉన్న ధనవంతుని బిడ్డ మాత్రము లోపలికి వెళ్లగలిగినాడు. నేను వెలుపలనే తిరుగుచుంటిని.

పిమ్మట కొంతసేపటికి లోపలి ఆవరణమునుండి పొగలెగయ నారంభించెను. మంటలు మండి వ్యాపించుచుండెను. ఆ మంటతో గూడ నెదురుబొంగులు పెఠీల్, పెఠీల్మని కాలి పగులుచున్న శబ్దము లోపలినుండి