156 చిన్ననాటి ముచ్చట్లు
మొదటినుండి లోపమే. ప్రస్తుతమామె తాంబరములో యొక చిన్న పాఠశాల నడుపుచున్నట్లున్నది.
మద్రాసు సేవాసదనము స్థాపించినవారు శ్రీ ముత్తా వెంక సుబ్బారావుగారును, వారి సతీమణి ఆండాళ్లమ్మగారును. ఈ సంస్థకు వారె తల్లిదండ్రులైయున్నారు. శ్రీ వెంకట సుబ్బారావుగారు మహోన్నత దశలోనుండి ఈ సేవాసదనమును స్థాపించుటవల్ల ఇది గట్టి పునాదితో వర్ధిల్లుచున్నది. ఇందు చదివిన వారందరుకూడ మంచిబ్రతుకు తెరువును సంపాదించుకొని ఆ దంపతులను సదాస్మరించుకొనుచు జీవయాత్ర సలుపుకొనుచున్నారు.
మద్రాసు స్త్రీసదనమని యొక శరణాలయము కలదు. పడుపు వృత్తియందు జీవించు పడుచులను, భర్తలచే తరుమగొట్టబడిన భార్యలను, అత్తపోరు పడలేక ఇల్లు వెడలి పారిపోయివచ్చిన పడుచులను, అనేక విధములగు అవస్థలు బాధలు పడలేక సంసారము త్యజించి పరుగెత్తి వీధినపడిన పడుచులను ఈ సదనము వారు చేరదీసి ఆదరించుచున్నారు. ఈ సదనమున విద్య, చేతిపనులు, మొదలైనవాటిని నేర్చి జీవించు మార్గములను చూపించుచున్నారు. తగు వరుడు చిక్కిన వివాహమును చేయుచున్నారు. పడుపువృత్తినే జీవించువారిని శిక్షానంతరము గౌరవముగా బ్రతుకుటకు బ్రతుకుదెరువు నేర్చి క్రమశిక్షణనిచ్చి కాపాడుటకు ఈ సంస్థకు పంపుదురు. అప్పడు వారికగు ఖర్చులు ప్రభుత్వము భరించును. ఈ విధముగ దీనికి ప్రభుత్వపు గ్రాంటులు వచ్చును. ఈ సంస్థలోని వారిని ఎంతో బందోబస్తుగా అనేక కట్టుదిట్టుములతో కాపాడవలసి వస్తున్నది.
శ్రీమతి డాక్టరు ముత్తులక్కీ రెడ్డిగారును ఈమెభర్త డాక్టరు రెడ్డిగారును చేరి అవ్వ శరణాలయమును తల్లిదండ్రులై పోషించుచుండిరి.