Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 157


శ్రీరెడ్డిగారు కాలగతిచెందిన తదుపరి శ్రీమతి ముత్తులక్ష్మీ రెడ్డిగారు వ్యవహారానుభవముగల వారగుటచే దీనిని చక్కగా అభివృద్ధికి తెచ్చినారు. ఆదిలో ఇది చిన్నసంస్థయే. ప్రస్తుతం అడయారులో పెద్ద భవనములను కలిగియున్నది.

నేను మంచిస్థితికి వచ్చినప్పడు గుంటూరు శారదానికేతనమునుండి సంగం లక్ష్మీబాయమ్మ యనునామెను మద్రాసులో చిత్రకళాశాలయందు చదువుకొనుటకు నా వద్దకు పంపిరి. ఈమె నాయింటిలోనే భోజనము చేయుచు మూడు సంవత్సరములు కళాశాలలో చదివి ఉత్తీర్ణురాలై యిప్పడు హైదరాబాదులో విద్యాలయమున సుఖముగ నున్నది. ఈమె ఖద్దరు వస్త్రములనే ధరించుచు దేశసేవాభిమానురాలైయుండెను.

నేను తిరుచూరులో యున్నప్పడు నాకు కృష్ణుడనే మంగలి క్షౌరము చేయుచుండెను. వాడికి జానికియను చెల్లెలు కలదు. ఆమె కొంతవరకు ఇంగ్లీషు చదివియుండెను. ఈమెను మద్రాసుకు తీసుకొనిపోయి నర్పుపని నేర్చించమని ఆ మంగలి నన్ను కోరెను. నేను దానికి సమ్మతించితిని. నేను మద్రాసుకు వచ్చునపుడు నాతో కూడ ఆమెను పిలుచుకవచ్చి నాయింట వుంచుకొని చదువు చెప్పించి గోషా ఆసుపత్రిలో చేర్చి చదివించితిని. ఇక్కడ ట్రైయినింగు ముగిసిన పిమ్మట గుంటూరు గవర్నమెంటు హాస్పిటలుకు పంపితిని. అక్కడామె యుండగ యొక డాక్టరును వివాహము చేసుకొని బిడ్డలతల్లి అయి సుఖముగ నున్నది.