పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134 చిన్ననాటి ముచ్చట్లు

అడ్డుపెట్టుకొని పూమాల నొకటి అతనిచేతి కందించును. అతడు దానిని ధరింపగా, పురోహితులు వేదమంత్రములు పఠించుచుండ - వధూవరులు ఒండొరులను చూచుకొందురు.

వారిలో పెండ్లికూతురునకు తాళిబొట్టు కట్టునది భర్తకాదు; తండ్రి. అనగా - వారు బాలికలకు తాళిబొట్టు కట్టుటను బాలురకుపనయన మొనర్చి యజ్ఞోపవీతము వేయుటవంటిదిగా భావింతురు. మాంగళ్య ధారణానంతరము, ఉదకపూర్వ కన్యాదానము, పాణిగ్రహణమును జరుగును. పాణిగ్రహణమప్పుడు పెండ్లికూతురు ఒకచేత అద్దము పట్టుకొని కుడిచేయి చాచి వ్రేళ్లు ముడుచును. ఆ ముడిచిన చేయి వీడదీసి అతడు పాణిగ్రహణ మొనర్చును. దీక్షా దినములు గడవగా - నాల్గవరోజున మంగళాస్నానములగును. ఆ రోజున మరికొన్ని తతంగములు జరుగగా, ఇద్దరు కలిసి ఒకే ఆకున భోజనమొనర్తురు. మనకు వలెనే వారికిని పున్నామనరకమునుండి యుద్ధరించుటకు పురుషు సంతానాపేక్ష మెండు.

ఆదిలో నేను మద్రాసునకు వచ్చినపుడు నేను చదువుకొనుచుండిన పాఠశాలలోని పిల్లకాయలు పెద్దవారలుకూడ ఆడమళయాళమును గురించి చిత్రవిచిత్రములైన కబుర్లను చెప్పుకొనుచుండిరి. ఆడమళయాళములో ఆడవారుతప్ప పురుషులే యుండురని చెప్పుచుండిరి. తప్పిదారి పురుషుడెవడైనను ఆ దేశమునకు పోయిన మళయాళ మంత్రములతో వానిని వశపరచుకొని వారిండ్లలో బందీలుగ చేసుకొని వార్లచేత సేవచేయించుకొనుచుందురనికూడ చెప్పుట వినియుంటిని.

ఆడమళయాళమనగ మాతృభక్తిగల పుణ్యభూమి. స్త్రీ స్వతంత్ర రాజ్యము. మనదేశమున పురుషుడు పుట్టుకతో అనుభవించు సర్వస్వతంత్రములన్నిటిని అక్కడి ఆడవారు జననమొందిన దాదిగ అనుభవించుచుచున్నారు.