Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు127

కుటుంబము చాల పేదదైనందున ఊరివారి సహాయముతో శంకరునకు ఉపనయనాది వైదికకర్మలను తల్లి చేయవలసి వచ్చెను. ఈ దేశపు నంబూదిరీ బ్రాహ్మణుల కులాచారముల ననుసరించి బాలునకు వేదాధ్యయనాది విద్యలను అక్కడి పండితులవద్దనే అభ్యసింపచేసెను.

శంకరునకు జ్ఞానప్రాప్తి సిద్దించిన వెంటనే సన్యసించవలయుననే కోరిక మనసున దృఢముగ నాటుకొనెను. అయితే తాను సన్యసించిన వంశక్షీణమగునని తల్లి తలంచి సన్యసించుటకు ఆమె అనుమతి నివ్వదేమోనని సంశయించుచు యోచించుచుండెను.

ఇటుండగ ఒకనాడు శంకరుడు ఇంటి సమీపముననే యుండిన నదీప్రవాహమున స్నానము చేయుటకు వెళ్లెను. స్నానము చేయుచున్న శంకరుని కాలును నదిలో యుండిన మొసలి గట్టిగ పట్టుకొని బాధించుచుండెను. అప్పడు బాలుడు బాధకు తాళలేక 'అమ్మా-అమ్మా! అని ఆర్తనాదమున తల్లిని పిలిచెను. వీరి ఇల్లు ఆ నదీ సమీపముననే ఉండినందున కుమారుని కేకలు తల్లి విని మరి కొందరినికూడ పిలుచుకొనివచ్చి కుమారుని అవస్థను చూచెను.

అప్పడు శంకరుడు తల్లినిచూచి 'అమ్మా మొసలి వాతపడి చనిపోవుచున్న నాకు సన్యాసమును స్వీకరించుటకు నీవు అనుమతినిమ్మ" అని దీనముగ తల్లిని ప్రార్థించెను. అప్పడు కుమారుని కష్టములనుచూచి సహింపలేక వెంటనే సన్యసించుటకు తల్లి అనుజ్ఞనిచ్చెను.

నర్మదా నదీతీరమున నివసించుచుండిన గోవిందాచార్యుల వారిని ఆశ్రయించెను. ఆయన బాలుని చేరదీసి జ్ఞానోపదేశమును చేసిన పిమ్మట సన్యాసమును ప్రసాదించి అనుగ్రహించి ఆశీర్వదించెను.