128 చిన్ననాటి ముచ్చట్లు
ఈ శంకరుడు కాశీక్షేత్రమునందుండి బ్రహ్మసూత్రం, దశోపనిషత్తు, భగవద్గీత ఈ మూడు గ్రంథములకు భాష్యం వ్రాసిరి.
ఈ శంకరభాష్యములే వీరి అఖండ శక్తికి నిదర్శనములు.
శంకరుడు కాశీనుండి ప్రయాగకు వెళ్లిరి. అక్కడ బౌద్ధమత విధ్వంసుకుడగు కుమారిలభట్టును దర్శించెను. కుమారిలభట్టు శిష్యుడగు మండనమిశ్రుని, సరస్వతీదేవితో సమానురాలైన వీరి భార్య, భారతీదేవిని దర్శించిరి. వీరిరువురను ఓడించి దిగ్విజయమును పొందిరి. పరాజయమును పొందిన మండనమిశ్రుడు స్వాములవారి శిష్యబృందమునచేరి సన్యాసమును స్వీకరించిరి. పద్మపాదుడు, మండనమిశ్రుడు మొదలగు శిష్యులను వెంటబెట్టుకొని దేశసంచారమును సల్పి పండితులనందరిని మెప్పించి దిగ్విజయమును బొందిన తర్వాత స్వామి శృంగేరి చేరిరి. ఆచార్యులు శృంగగిరి చేరినప్పడే తల్లి ఆర్యాదేవి చరమశయ్యపై పరుండి తన్ను స్మరించుచున్నట్టు జ్ఞానదృష్టితో గ్రహించినవాడై స్వగ్రామమగు కాలడికి మరలివచ్చి తల్లిని దర్శించెను. కుమారుని చూచి సంతసించి తల్లి మరణించెను. ఆమెను స్మశానమునకు తీసుకొనిపోయి కర్మక్రియలను జరుపవలసివచ్చి స్వజాతి నంబూదిరి బ్రాహ్మణులను పిలిచి తనకు సహాయపడవలయునని వారిని కోరిరి. గాని వారెవరును సహాయపడక నిరాకరించిరి. ఏలననగా శంకరుడు సన్యాసి అగుట వలన మాతా పితృ కర్మలను ఆచరించు అధికారము లేదు. మరియు బ్రహ్మచారిగ నుండి సన్యసించినది శాస్త్ర విరుద్దమని కక్ష కట్టి శంకరుని వెలివేసి సహాయ నిరాకరణమును సాగించిరి. అది వర్షాకాలము. జోరున వర్ధము కురియుచుండెను. కాల్చుటకు కట్టెలు లేవు. అప్పడు శంకరుడు తోటలోనున్న అరటిమాకులను నఱకి కాష్టమును పేర్చి అగ్నినుంచెను.