122 చిన్ననాటి ముచ్చట్లు
రెండుగాని మూడుగాని పక్షిరాజులు వచ్చి పండారమువద్ద వాలును. అవి ఆ ప్రాంతముల కొండగృహాలనుండి వచ్చుట చూడనగును. అయితే అవి ఒకటి కాశీనుండియు, మరియొకటి రామేశ్వరమునుండియు వచ్చినట్లు తీర్ధప్రజల కతడు చెప్పును. పక్షిరాజులు వచ్చినవెంటనే పండారము వాటికి స్నానము చేయించి తిరుమణి శ్రీ చూర్ణముతో అలంకరించి తెచ్చిన చక్కెరపొంగలిని పక్షులకు పెట్టును. పక్షులు తిని, మిగిలిన ప్రసాదమును వచ్చినవారందరికి పంచిపెట్టును. ఆ పక్షులు వచ్చిన త్రోవనే మరల యెగిరిపోవును. ఈ ప్రకారము దినము జరుగుచుండును. వందలాది సంవత్సరములుగ పక్షులు యిక్కడికివచ్చి ధర్శనమిచ్చుచున్నట్లు స్థలపురాణము గలదు. కొండక్రిందయుండు శంఖుతీర్ధమున 12 సం|| కొకసారి శంఖమొకటి గొప్పధ్వని చేయుచు వైకిలేచునని అక్కడివారు చెప్పెదరు.
కాంచీపురము వచ్చితిమి. వరదరాజస్వామి దేవాలయమున అర్చన వగైరాలను జరిపించి గుడిలో యుండు బల్లిని తాకితిమి. ఈ బంగారు బల్లిని తాకినవారికి బల్లిపడిన దోషముండదు.
దేవి ఈశ్వరునికై మామిడిచెట్టుక్రింద తపమాచరించెననియు, ఈశ్వరుడచ్చట ప్రత్యక్షమై దేవిని వివాహమాడెననియు కథ. ఆదిలింగమని చెప్పబడునది మామిడిచెట్టు క్రిందనున్నది. ఆ మామిడిచెట్టు చాలా పురాతనమని చెప్పదురు. మామిడిచెట్టు క్రింద వెలిసిన దేవుని ఏకామ్రేశ్వరుడు అందురు.
ఈ దేవాలయమును నాటుకోటు శెట్లు లక్షలాదులను ఖర్చుపెట్టి మరల కట్టించిరి. అక్కడి నల్లరాతి స్తంభముల మీద చెక్కబడియుండు విగ్రహములను చూడదగినవి. శ్రీ ఆదిశంకరులవారి విగ్రహమున్ను ఈ దేవాలయమున నున్నది.