చిన్ననాటి ముచ్చట్లు123
సాలెపురుగునకు, పామునకు, ఏనుగునకు మోక్షమిచ్చిన ఈశ్వరుని క్షేత్రమగుటచే "శ్రీకాళహస్తి" అని దీనినందురు. ఇదియును పురాతనమైన మహాక్షేత్రము. ఈశ్వరునకు తుమ్మిపూల అర్చన విశేషము గనుక ఈ దేవాలయములో తుమ్మిపూల మాలలను సుందరముగకట్టి విక్రయించుచుందురు. స్వామిని దర్శించుటకు పోవువారందరు తుమ్మి పూల మాలలను తీసుకొని పోయి లింగమునకు అలంకరించెదరు. ఈవూరిలో నాకు మంచి స్నేహితులు శ్రీ ఎన్. సాంబయ్యగారున్నందున వారింటిలోనే బస చేసితిమి.
ఈ ఊరి ప్రక్కన సువర్ణముఖీనది యున్నది. ఈ ఊరినంటి చిన్న కొండ తిప్పలున్నవి. ఆ తిప్పల మధ్య భరద్వాజాశ్రమమున్నది. అందొక తిప్పపై మూరెడు పొడవున దుబ్బుగా పెరుగు గడ్డియొకటి గలదు. ఆ గడ్డి భూమినుండి తీయకే పిడికెడు పోచలు చేతబట్టి ఏదైనను కోరుకొనుచు, ముడివేసినచో, ఆ కోరిక ఈడేరునని చెప్పదురు. వెళ్లిన యాత్రికులందరున్నూ ఆ పనిచేసి వచ్చుచుందురు.
ఏడుకొండలవానిని దర్శించుటకు తిరుపతి వెళ్లితిమి. తిరుపతిలో ఒక యింటిని బాడుగకు తీసుకొని దిగితిమి. కొండకు నడిచియే నిదానముగ యొక్కగలిగితిమి. కొండపైకి పోయి యిరువురము క్షౌరకల్యాణమును చేసుకొని, తీర్థస్నానమును చేసి, వెంకటరమణుని దర్శించి అర్చించి కర్పూరహారతి నిచ్చితిమి. చెల్లనికాసులను కొండికాసులను స్వామిహుండీలో వేసి నమస్కరించితిమి. అచ్చట మూడుదినములుండి దిగువ తిరుపతికి వచ్చి స్వామిభార్య అలిమేలుమంగ తాయారును దర్శించి కుంకుమార్చనను చేసితిమి.