120 చిన్ననాటి ముచ్చట్లు
ఎదురుగునున్న పెద్ద వృషభమును చూచి ప్రదక్షిణముచేసి తాకి ఆనందించితిమి. ఈ దేవాలయము చుట్టు అగడ్త గలదు. పూర్వపు తంజావూరు రాజులు ఈ దేవాలయమునే కోటగా కట్టుకొనిరి. దేవాలయపు ప్రహరీగోడలు చాలా పొడవైనవి. శిథిలమయిన స్థితిలో యున్న శ్రీ సరస్వతి భాండాగారమునకు వెళ్లి నమస్కరించితిమి.
తంజావూరికి సమీపమున తిరువయ్యారు పంచనదీ తీరమున వున్నది. ఇక్కడనే త్యాగయ్యగారు నివసించి, రాముని భజించి, కీర్తనలు పాడి కీర్తిని బడసిరి. వీరి సమాధికి ప్రదక్షణమును చేసితిమి. వారుండిన యింటికి పోతిమి. ఆ యింటివారు త్యాగయ్యగారు ఆరాధించుచుండిన పురాతనపు శ్రీరామపంచాయతనం దేవతార్చన మందసమును చూపిరి. మేమును ఆ దేవునికి నమస్కరించితిమి.
తంజావూరునుండి శ్రీరంగము చేరినాము. శ్రీరంగ దేవాలయ గోపురము దర్శించగనే,
కావేరీ గిరీయాన్తోయం వైకుంఠ రంగమందిరం
పరవాసుదేవో రంగేశ ప్రత్యక్షంపరమంపదం
అని స్మరించుచు ఏకాదశి సత్రమున దిగితిమి. ఆనాడు మధ్యాహ్నము రాత్రియను రంగని సేవించి పూజించితిమి. మరునాడుదయముననే పోయి స్వామి యెదుట జరుగు విశ్వరూప దర్శనమును చూచి సంతసించితిమి. కావేరి కొల్లడములో, బ్రహ్మ ముళ్లతో స్నానము చేసితిమి. దేవాలయమునకు పోయి పులిహోర, దధ్యోజనము, నేతిగారెలను కొనుక్కొని యింటికి పోతిమి.
శ్రీరంగమునుండి తిరుచునాపల్లికి వచ్చి అక్కడి వుచ్చిపిళ్లారికొండ నెక్కి పిళ్లారి (విఫ్నేశ్వరుడు)ని దర్శించితిమి. కొండమీదనుండి శ్రీరంగము తిరుచునాపల్లి పట్టణములను చూచిన చిన్నవిగను చిత్రముగను కనుబడును.