Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు119

విగ్రహమున్నూ, ఆరు తలలతో షణ్ముఖస్వామి విగ్రహమున్నూ కలవు. ఆ తరువాత మీనాక్షీదేవి వేటాడు ఆటవిక స్త్రీగాను, సుందరేశుడు వేటగాడుగాను చెక్కబడిన చిత్రగాధలున్నవి.

ఆ లోపలనే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయమున కటునిటు వాలిసుగ్రీవుల విగ్రహములు, చంద్రమతి హరిశ్చంద్రుల విగ్రహములు చెక్కబడియున్నవి. దేవాలయం బయట - తిరుమల నాయకుని సత్రం కలదు. సుందరేశుడు తిరుమల నాయకునికి ప్రతి సం||మున్నూ 10 రోజులు అతిథిగానుందునని వరమిచ్చెనట. స్వామివారు వచ్చి విడిదిచేయుటకు అర్ధముగా నీ సత్రము కట్టించబడినది. దీనిని కట్టించుటకు 22 సం||లు పట్టెనని చెప్పదురు. మధురకు రెండుమైళ్ల దూరములో తిరుక్కైకుండ్రను స్థలములో గొప్ప శివాలయము గలదు.

మధురనుండి రామనాథపురం దర్భశయనం మొదలగు క్షేత్రములను చూచుకొని రామేశ్వరమునకు చేరితిమి. నివసించుటకు మంచి యిల్లు దొరికినది. అక్కడ చేరిన మర్నాడు మొదట యాత్రికులు చేయవలసిన కార్యక్రమ కర్మములు మొదట క్షౌరకల్యాణము, పిమ్మట చంద్ర పుష్కరిణిలో ముక్కు మూసుకొని స్నానము, అటుపిమ్మట దేవాలయములోయున్న బావులలోని శుద్దోదక స్నానము! మాకు సంతానము లేకుండుటవలన ఇక్కడ నాగప్రతిష్టను చేయదలచుకున్నాము. నాగప్రతిష్ట మంత్ర తంత్రములతో జరిగెను. ఆ వూరు విడచి వచ్చునాడు మనము ప్రతిష్ట చేసిన నాగమయ్యను చూచిపోవుదమని యిరువురము గుడికి పోతిమి. మేము ప్రతిష్ట చేసిన నాగమయ్య మాయమైనాడు.

తంజావూరులోయున్న రాజాసత్రమున దిగితివిు. దేవాలయమునకుపోయి బ్రహ్మాండమైన లింగమునుచూచి పూజించితిమి.