118 చిన్ననాటి ముచ్చట్లు
బసచేసితిమి. వీరు సరస్వతి బ్రాహ్మణులు. మత్స్యములను తినుటకు అలవాటుపడినవారు. ఆనాడు మాకు మాత్రము వడ్డించలేదు.
తిరుచూరునుండి ఈరోడ్ మార్గమున శ్రీరంగము, మధుర, తిరునల్వేలి చూచుకొని కుత్తాళమునకు చేరితిమి. కుత్తాళములో శ్రీమౌనస్వామి మఠములో బసచేసితిమి. ఈ స్వామి నాకు మద్రాసులో పరిచయమగుటచే వీరు మమ్మాదరించి అనుగ్రహించిరి. అక్కడి ఆకాశగంగలో కొన్ని దినములు తృప్తిదీర స్నానమును చేసితిమి. చల్లని జల్లులలో ఆప్యాయముగ తడిసితిమి. పచ్చి జాజికాయలను, లవంగములను, ఏలక్కాయలను తనివితీర తాకి రుచి చూచితిమి. అయిదు ఆకాశధారల వద్దకుపోయి త్రోవలోయుండు లతావృక్షముల సౌందర్య మనుభవించితిమి. కుత్తాళమునుండి తిరిగివచ్చునప్పడు మధురలో దిగితిమి.
మధురలో వారము దినములు మకాంచేసి దేవాలయముయొక్క అద్భుత శిల్పశాస్త్ర ప్రదర్శనమును దినము చూచుచుండినను తనివితీర లేదు. పురాతన హిందువుల గొప్పతనమును దెలుసుకొనుటకు ఈ దేవాలయ గోపురములు, రాతిస్థంభములలో చెక్కబడిన సుందరమైన విగ్రహములే సాక్షులు. ఎంతకాలము యీ చిత్రములను చూచినను వింతగనే యుండును. దక్షిణదేశములోయుండు దేవాలయములలోనెల్ల యిదియే గొప్పది. పరిశుద్ధముగ నుండునది. చక్కని యేర్పాట్లు గలది.
దేవాలయమున దక్షిణ భాగము మీనాక్షీదేవికి సంబంధించినది; ఉత్తర భాగము సుందరేశునికి సంబంధించినది. ఇందు అష్టలక్ష్మీ మండప మొకటి కలదు. లక్ష్మీదేవియొక్క 8 రూపములు ఇక్కడ విగ్రహములుగా వేయబడియున్నవి. ఇక్కడనే మీనాక్షీ సుందరేశుల కథలును చెక్కబడియున్నవి. ఈ మంటపమునకు ప్రక్కననే సుందరమైన గణేశ