పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 117

తిరువాన్కూరు రాజ్యమంతయు శ్రీ పద్మనాభస్వామివారిదనియు వారి ప్రతినిధులుగా వారిదాసులై తాము రాజ్యమొనర్చుచున్నామనియు - ఈ రాజులు భావింతురు. రాజ బిరుదములలో 'పద్మనాభ దాస' అనునదియు కలదు. అనంత పద్మనాభస్వామివారి విగ్రహము చాలా గంభీరముగ నుండును.

అక్కడనుంచి మేము మొట్టమొదట కన్యాకుమారి క్షేత్రమునకు పోతిమి. అక్కడ సర్కారు సత్రములో దిగితిమి. ఆ సత్రములోయుండే బావిని చూచినప్పుడు గుంటూరు బావులు నాకు జ్ఞాపకమునకు వచ్చినవి. వంటవాడు వంటచేయు లోపల మేము సముద్ర స్నానమునకు వెళ్లివచ్చితిమి. ఇచ్చట పడమటి సముద్రము, తూర్పు సముద్రము సంధించు స్థలము. భారతదేశమునకు కొన యిది. ఇక్కడ అలలు ఉరవడిగా కొట్టుకొను చుండును. అందుచే స్నానమొనర్చువారికి ప్రమాదములేకుండా లావాటి ఇనుపగొలుసులను అడ్డముగా కట్టియుంచిరి. అక్కడి క్షేత్రవాసులు శ్రీరాముడు ఇక్కడనుండియే వారధికట్టి లంకపై దండెత్తెనని చెప్పదురు. అవిగో పెద్దరాళ్ల వంతెనను చూడుడు అని చూపుదురు; ఇదియే సేతుబంధన స్థలమనెదరు. స్నానానంతరము దేవాలయమునకు వచ్చి అమ్మవారిని దర్శించి పూజించితిమి. అమ్మవారి విగ్రహమునకు పసుపు దట్టముగ మెత్తబడి యుండును. పావడను గట్టి శృంగారింతురు. చూచుటకు 10 సం||ల కన్యకవలెనే అమ్మణ్ణి ఎంతో అందముగా నుండును.

ఈ ఊరు విడిచి సుచీంద్రమునకు వెళ్లితిమి. ఇక్కడి దేవాలయము చాల పురాతనమైనదిగాక అందమైనదికూడ.

షేంకోటలో మేము రాజభవనమున దిగి అక్కడనుండి స్టీముబోటులో పైకము ఆలస్పళె, అంబలప్పళె మొదలగు క్షేత్రములకు పోతిమి. పిమ్మట ఎర్నాకుళము పోయి ప్రసిద్ద వకీలు సుగుణపాయిగారింట