106 చిన్ననాటి ముచ్చట్లు
నేంద్రం అరటిపండుతోను హల్వాను తయారుచేసి జాడీలలో నిల్వయుంచుకొని పండుగలకు పాయసమునుచేసి భుజించెదరు. శుభకార్యములకు పిండి వంటలకంటె పాయసములే ముఖ్యములు. పాలుపాయసం (బియ్యం, పాలు, చక్కెర), చక్క ప్రధమన్ (పనసపండు, బెల్లం పాయసం) నేంద్రపళం ప్రధమన్ (నేంద్ర అరటిపండు, బెల్లం పాయసం) పచ్చపయిరు ప్రధమన్ (పెసరపప్పు, బెల్లం, కొబ్బరతురుం పాయసం) ఈలాటివి యింకను కొన్ని పాయసములను తయారు చేసెదరు. నేంద్ర అరటి కాయలతో వుప్పుగాను తీపిగాను వరవలుచేసి నిల్వవుంచుకొని కాఫీతో కూడ చిరుతిండిగ నుపయోగించెదరు. బిడ్డలకు బిస్కతులకు బదులు వీటి నిచ్చెదరు.
తిరుచూరు అష్టాంగ ఆయుర్వేదవైద్యమునకు పుట్టినిల్లు. శాస్త్రసమ్మతమైన ఔషధ రాజములను తయారుచేయుటకు వనఓషధులు యిక్కడ లభించునట్లు మరియెక్కడను లభింపవు. తెల్లవారగనే పడమటి కనుమలనుండి పచ్చిమూలికలను మోపులుమోపులుగ దెచ్చి విక్రయించెదరు. ఒకే తడవ సుగంధి పాల వేరు, అశోక పట్ట, బిల్వవేరు మొదలగునవి యెన్ని టన్నులు కావలసినను దొఱకును. ఈ వూరినిండుగ ఓషధి ద్రవ్యములను, ఔషధములను విక్రయించు అంగళ్లు గలవు. ఇక్కడి వారు ప్రతిదినము యేదో ఒక తైలమును వంటికి, తలకు రాచుకొననిది స్నానమును చేయరు. వాత వ్యాధులను కుదుర్చుకొనుటకు పలుదేశములనుండి యిక్కడికి వచ్చి చికిత్సలను పొందెదరు. నవరక్కిళి, పిళింజలు, ధార మొదలగు ప్రత్యేక చికిత్సలను చేయుటకు యిక్కడ సమర్దులున్నారు. సర్కారు ఆయుర్వేద వైద్యశాల యున్నది. సుప్రసిద్దమాసు వైద్యవేత్తలు యిక్కడివారే.
ఔషధములను తయారు చేయుటకు అన్ని అనుకూలములు యిక్కడనున్నందున ఈ వూరిలో 'కేసరి కుటీరము'ను స్థాపించితిని.