Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు105

ఆరోగ్యము నిచ్చునవి. ఈ వూర 7 మాసములు వర్షాకాలమగుటచే బావులలో నీరు పైభాగము వరకు వచ్చుచుండును. నేల కంకరభూమి అగుటవలన నీరు నిర్మలముగనుండును. కేరళదేశస్తులు నీళ్లను చూచినప్పుడెల్లను స్నానముచేయుటకు ఇష్టపడెదరు. కనుకనే వీళ్లను 'నీళ్లకోళ్లు' అనెదరు. ఈవూరిలో అక్కడక్కడ స్నానము చేయుటకు తటాకములు గలవు. ప్రతి దేవాలయము ప్రక్కనను స్నానముచేయు కోనేళ్లు కలవు. ఇక్కడివారికి చెంబుతో నీరును నెత్తినపోసుకొను అలవాటు లేదు. గుంటలలో మునిగి స్నానము చేయనిది తృప్తిలేదు. ఆడవారికందరికి ఈత తెలియును. ప్రజలందరు ప్రాతఃకాలమున లేచి స్నానముచేసి దేవాలయములకుపోయి దేవుని పూజించిన పిమ్మటనే వారివారి ఉద్యోగములకుపోవు ఆచారము గలదు. భోజన పదార్ధములలో కొబ్బెర తురుమును, కొబ్బెర నూనెను విరివిగ వాడెదరు. స్నానమును చేయునప్పుడు వీరు వంటికి, తలకు టెంకాయ చమురును పట్టించుకొని స్నానమును చేసెదరు. ఈ అలవాటు వలన వీళ్లకు చర్మవ్యాధులు రావు. స్త్రీల శిరోజములు దీర్ఘముగ వెరిగి తుమ్మెద రెక్కలవలె నల్లగ మిసమిసలాడుచుండును. వేడినీళ్ల స్నానమెరుగరు. భోజనము సాత్వికాహారము. స్త్రీలకు ఉండునంత స్వతంత్రము పురుషులకు లేదు. సంపన్నుల యిండ్లలో స్నానమును చేయుటకు తోటలలో తటాకములను త్రవ్వించుకొని యిష్టము వచ్చినప్పుడెల్లను స్నానమును చేయుచుందురు. తమ యిండ్ల చుట్టు వివిధ ఫల వృక్షములను నాటి, పెంచి వాటి ఫలములను అనుభవించెదరు. అనేకరకములైన అరటి, పనస, ముఖ్య ఫల వృక్షములు, జాజికాయ చెట్లునుండును. ప్రసిద్ధములైన కొబ్బరిచెట్లు గలవు. అరటి ఆకులలో పొడుగాటి మనిషి పడుకొని హాయిగ నిద్రించవచ్చును. నేంద్రం అరటిపండ్లు చాలా ప్రశస్తములయినవి, మంచి ఆరోగ్యమునిచ్చు ఫలములు. పనసపండుతోను