94 చిన్ననాటి ముచ్చట్లు
జనులందరు నడివీధిలో నిలుచుని దొరగారి రాకకు నిరీక్షించు చుండు సమయమున ముందుపోయిన ముదాము వచ్చి దొరగారి బండి వచ్చుచున్నదని చెప్పును. అప్పడు భజంత్రీలు మేళమును, మాదిగ వాండ్లు తప్పెటలను వాయించెదరు. భోగమువారు కాళ్లగజ్జలతో సందడి చేసెదరు. తక్కినవారు నడుములకు గుడ్డలు చుట్టుకొని చేతులు కట్టుకొని వేచియుందురు.
దొరగారు వచ్చు పెట్టెబండిని కరణంగారు ఫర్లాంగు దూరమున చూచి గడగడ వణకుచు, ఊడిపోవు గోచిని సవరించుకొనుచుండును. బట్టతలపైన నుండు గువ్వకన్ను తలగుడ్డ పక్కకు జారుచుండును. కట్టుకున్న పాలచంగావి ధోవతి వూడిపోవుచుండును. రొంటిన వుండిన పొడిబుఱ్ఱ క్రిందపడును. ఈ సమయమున దొరగారు, దొరసానిగారు బండి దిగుదురు. వెంటనే వీరందరు ఆ దంపతులకు రెండు చేతులతో సలాములు పెట్టెదరు. అంత మేళతాళములతోకూడ భోగము వారితో వూరేగుతు పాత కచ్చేరి సావడికి బసకు పోయెదరు. వెనుకనుండి వచ్చు రెండెద్దుల బండిలో పడక కుర్చీలు, స్నానము చేయుటకు తొట్టి, కక్కసుకుపోవు కమోడులు (మలవిసర్జన పింగాణి గిన్నెలు) మొదలగు సామానులన్నియు దిగును. కూడవచ్చిన బట్లరు (వంటవాడు) వంటకు కావలసిన సామగ్రినంతయు సరిచూచుకొని భోజనమును తయారు చేయును. దొరగారితో కూడ వచ్చిన క్యాంపు క్లర్కు (Camp Clerk) లకు మామూళ్లను చెల్లించి వారికి భోజనవసతికి యేర్పాటు చేయుదురు. మరుసటిరోజున తెల్లవారి కాఫీ పుచ్చుకొనిన పిమ్మట దొరసానితో కూడ దొరగాను తుపాకిని చేతపట్టుకొని వేటకు బయలుదేరును. మొదట వూరిలోనికి పోయి అక్కడక్కడ తిరుగుచుండిన పందులను కాల్చి చంపును. దెబ్బతగిలి క్రిందపడి కీచుకీచుమని అరచి ప్రాణమును విడుచు పందిని చూచి ప్రక్కనున్న దొరసాని, దొరగారి శూరత్వమునకు మెచ్చుకొనుచు, చేతులను తట్టి సంతోషించుచుండును. చనిపోయిన పందుల