పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 93

దొరగారు ఉదయమున వంగవోలులో కాఫీని పుచ్చుకొని దొరసాని సమేతముగ రెండెద్దుల పెట్టె బండినెక్కి సుమారు రెండుగంటల కాలములో మా వూరు చేరేవారు. మావూరు వంగవోలుకు 7 మైళ్లదూరమే గనుక 9 గంటలలోపుగనే వూరికి వచ్చేవారు ఆ నాడు వూరంతయు పిల్లజల్లలతో కోలాహలముగ నుండెడిది. ముతక చీరలతో రెడ్డి పడుచులును, రంగు చీరలతో బ్రాహ్మణ ముత్తయిదువలును అక్కడ చేరేవారు.

దొరగారు వచ్చేలోపల తప్పెటలను మంటకు కాచుకొని, కాళ్లకు గజ్జలను కట్టుకొని చిందులను తొక్కుచు మాలవారు సిద్దముగ నుండెదరు. బ్రాహ్మణులు మాత్రము మాలమాదిగలకు దూరముగ నిలుచుండెదరు. మా వూరి దేవాలయ మాన్యముల ననుభవించుచుండు భోగమువారు చెదలవాడనుండి వచ్చి ఆటపాటలను సలుపుచుండిరి. వీరిని ఆదరించి అన్నమునుపెట్టు పెద్దమనుష్యులు గ్రామములో చాలమంది యుండిరి. ఆనాడు మా వూరు పార్వేట పండుగవైభవముతో నుండెడిది.

మా వూరి గ్రామకరణము తెలివిగల ముసద్దీ. మంచి మేనిఛాయ గలిగిన భారీ విగ్రహము. బట్టతల, పెద్దబొజ్జ గలిగిన మంచి మాటకారి. ఊరివారందరికి వీరిని చూచిన భయము, భక్తి యుండినది. గ్రామ మునసబు నిరక్షరకుక్షి అయినను తన చేవ్రాలు చేయుటకు మాత్రము నేర్చుకొని యుండెను. కలక్టరుగారు గ్రామములో ప్రవేశించుటకు పూర్వమే కరణము గారు పాతలెఖ్ఖలను సవరించుకొని, పాతదస్తరమును మార్చుకొని లెఖ్ఖల తనిఖీకి సిద్దముగ నుందురు. ముందుగవచ్చిన బిళ్లబంట్రోతులు గ్రామము మీదపడి దొరగారికి కోళ్లను, మేకలను, గ్రుడ్లను సేకరించుకొనెదరు. వంగవోలునుండి మంచి బ్రాందిబుడ్లను తెప్పించి వుంచెదరు.