చిన్ననాటి ముచ్చట్లు
95
కామందులు వచ్చి యేడ్చుచు పందులను ఈడ్చుకొని యింటికి పోవుచుండిరి. పిమ్మట యేటివడ్డున వుండిన నేరేడు తోపులోనికి పోయి చెట్లమీద హాయిగ విహరించుచుండిన రంగురంగు పక్షులను కాల్చి నేల కూల్చును. క్రిందపడిన పక్షులను యేరి దొరసాని సంచిలో వేసుకొని పోవును. ఈ వేటకు కరణం మునసబుగార్లు ముందు నడుచుచు దోవ తీయుచుందురు. వేట అయిన పిమ్మట దొరగారు బసకువెళ్లి భోజనానంతరము విశ్రమించిన పిమ్మట కరిణీకపులెఖ్ఖల తనిఖీ ప్రారంభమగును. ఈ జమాబందికి చుట్టుప్రక్కలయుండు గ్రామకరణాలుకూడ లెఖ్ఖలను తీసుకొని ఈ వూరికే వచ్చెదరు. గనుక ఈ లెఖ్ఖలతనికి ఈ వూరిలో కొన్నిదినములవరకు జరుగును. కలక్టరు క్యాంపు ఈ వూరిలో నుండు నప్పుడు కలక్టరు సిబ్బంది వూర్లమీదపడి సంపాదించుకొనుచుండిరి. చదలవాడనుండి వచ్చిన భోగమువారు కూడ కరణాలను ఆశ్రయించుకొని యిక్కడనే యుండెదరు.
జమాబందికి వచ్చిన కరణాలందరు నా మేనమామ ములుకుట్ల మహాదేవయ్య గారింట బస చేయుచుండిరి. ఈ కరణాలందరికి వంతు ప్రకారము ఆలపాటి చినవీరాస్వామిశెట్టిగారు పొత్తరలను (భోజన సామగ్రిని) పంపుచుండిరి. మనిషికి తవ్వెడు చేరుడు బియ్యమును, గిద్దెడు ముడిపెసలును, చిన్న నిమ్మకాయంత చింతపండును, అరగిద్ద వుప్పును, పిడికెడు మిరపకాయలను, చిన్న చిట్టెడు సిద్దెనెయ్యిని పంపుచుండిరి. ఊరిలో యుండు గొల్లలు ముంతెడు గొల్లపెరుగును పంపుచుండిరి. ఈ భోజన సామగ్రితో మా అత్తగారు ముడిపెసల ముద్దపప్పును, ఇంటిలో నుండిన వంగవరుగు ధప్పళమును, చింతతొక్కు పచ్చడిని తయారుచేసి భోజనమును పెట్టుచుండినది. ఆ దినమున వారింట వరి అన్నము గనుక మామగారు నన్నుకూడ భోజనమునకు పిలిచేవారు. భోజనానంతరమున కరణాలందరు వీధిపంచలో కూర్చుని ఘాటయిన పాటిపొగాకు చుట్టలను పీల్చిన పిమ్మట చెంబెడు నీళ్లను త్రాగి, నులకమంచములపైన పరుండి గాఢ