92 చిన్ననాటి ముచ్చట్లు
ఈ మాటను వినిన వెంటనే వీరిరువురు గ్రామ ముదామును పిలువనంపి మాలపల్లెలోనుండు వెట్టివార్లను పిలిపింతురు. గ్రామనౌకర్లను పాడుపడి యుండిన పాతకచ్చేరి సావడిని వూడ్చి నీళ్లు చల్లమని చెప్పుదురు. గ్రామచాకలిని దివిటీతో కూడ సావడివద్ద సిద్దముగా నుండవలయునని వుత్తరువు చేయుదురు. కుమ్మరికి కూడ కబురు పంపుదురు. ఆ రాత్రి యంతయు కరణముగారికిని ముసనబుగారికిని నిదుపట్టెడిది కాదు. తెల్లవారగనే లేచి మంగలి బాపిగాడిని పిలువనంపి క్షౌరమును చేయించుకొందురు. మాలమాదిగలకు కబురు పంపి తప్పెటలను, తాషామార్పములను, బూరగలను తయారు చేయుదురు. మంగల బాపిగాడిని దూదేకుల హుసేన్ సాహేబును పిలిపించి మేళమును సిద్దము చేయమందురు. గ్రామములో పలుకుబడిగల ఆలపాటి పెదవీరాస్వామి, చినవీరాస్వామి, వెంకటస్వామి మొదలగు శెట్లకును, వాకా రామిరెడ్డి, వీరారెడ్డి, లచ్చారెడ్డి మొదలగు రెడ్డి బృందమునకును, ఇనుమనమెళ్ళూరి నల్లసుబ్బయ్య, యెఱ్ఱసుబ్బయ్య, రామస్వామి, క్రిష్ణస్వామి, మీనయ్య మొదలగు నియోగులకును, బడిపంతులు పిచ్చయ్య నంబి వరాహాచార్యులు, తంబళ పున్నయ్య అను దేవాలయముల అర్చకులకును, వేదాధ్యయ నాది పండితోత్తములగు కొరవి, బుద్దవరపు వార్లకును వీరందరకును కలక్టరు రాకను తెలియ పరుతురు. మా వూరిలో సుమారు 40, 50 బ్రాహ్మణ కుటుంబములుండెడివి. వైష్ణవులలో ఉప్పలవారు మంచి భూస్వాములుగ నుండిరి.
వీరందరుకూడా తెల్లవారగానే గుండ్లకమ్మ యేటిలో స్నానమునుచేసి వైదిక కర్మలను తీర్చుకొని విభూతి రేఖలతోను పంగనామములతోను పింజబోసిన ధోవతులతోను దొరగారి దర్శనమునకు వేచియుండెదరు.