పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు 91

హాస్యముగా నుండును. పైన చెప్పిన పండితులవద్ద స్వయముగా తర్ఫీదైనవారి హాస్యము పండిత సమ్మతమై సభ్యముగా నుండును. అసలు జంగము కథారచనా విధానమే రసవంతమైనది. శ్రీ వేదము వేంకట్రాయశాస్త్రులవారు బొబ్బిలికథ పద్యకావ్యముల కన్న జంగము కథయే రసవత్తరమని చెప్పియున్నారు. అట్టి రచనను ప్రత్యక్షముగా పాటగాండ్రు ఒక విధమగు నాటకమాడి వినిపించి వివరించునప్పుడు శ్రోతలు తన్మయులగుదురనుట ఆశ్చర్యముగాదు. బొబ్బిలికథను వినునప్పుడు ప్రేక్షకులు ఉద్రేకులయ్యెదరు. బాలనాగమ్మ కథను విన్న స్త్రీలు జాలి నొందెదరు. దేశింగురాజు కథలో అతని పరాక్రమమును, మహబత్ ఖానుని స్నేహమును వర్ణించి చెప్పనప్పుడుగల హిందూ మహమ్మదీయ సఖ్యతను తలచి కొనియాడుదురు. ఈ జంగము కథ పద్ధతి ననుసరించి చెప్పు కథలకే, ఇప్పడు బుర్రకథలని చెప్పుచున్నారు. నూతన రాజకీయ సాంఘిక ప్రచారములను ప్రాచీన ప్రచారక పద్దతుల ననుసరించి జంగము కథలు, తోలుబొమ్మలాటలు, వీధి భాగవతముల ద్వారా సలుపుట ఎంతో ఫలప్రదమని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చిరకాలము క్రిందటనే చెప్పియున్నారు.


నాకు తెలియకమునుపే మా వూరిలో (ఇనమనమెళ్ళూరు) యుండిన తాలూకా కచ్చేరిని వంగవోలుకు మార్చిరి. కచ్చేరి యుండినప్పడు మా వూరుకూడ పేరు ప్రతిష్టలతో యుండినదట. నేను కుఱ్ఱవాడనుగ నున్నప్పుడు మా వూరికి కలెక్టర్లు సబ్కలెక్టర్లు మొదలగు తెల్లదొరలు జమా బందికి వచ్చుచుండిరి. జమాబంది అంటే ప్రతి సం॥మున్ను రెవిన్యూ లెఖ్ఖలను తనిఖీ చేయుట. వారు మా వూరికి వచ్చుటకు ముందురోజున వంగవోలునుండి ఒక బిళ్ల బంట్రోతు గ్రామమునకు వచ్చి గ్రామ కరణమగు ఇనమనమెళ్ళూరి రాంభొట్లుగారిని, గ్రామ మునసబు వాకా రామిరెడ్డిగారిని చూచి దొరగారు రేపు ఈ వూరికి మకాం వేసుకొని వచ్చుచున్నారని చెప్పును.