పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/854

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

958

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుదాహరిస్తే గ్రంథం పెరిఁగిపోతుంది. ఆ విమర్శనంలో మఱీ అనాలోచితంగా తమకలం పరుగెత్తింది. కణప, ఫణిప, యీ రెండుశబ్దాలనీ మీరు పరిశీలింపక ఆక్షేపించారు. “కణపయితాహే... ఫణిపయితాహే” అనే పెద్దమహామహుని ప్రయోగాన్ని ఆశాస్త్రుల్లుగా రుదాహరించారు వాగ్బంధంలో. ఆ మహామహుఁడు “కోశనానాచార్యః" తెగలోవాఁడు, మా బోట్లకు దానితో వాగ్బంధం కాక తప్పుతుందా? వారుంచినపేరు సార్థకమయిందనుకొన్నాను. వూరుకున్నాను. యీలాటివెన్నో చూపఁగలను తమరు తొందరపడ్డవి.

గురు : నీవు తొందరపడ వనుకొందును.

శిష్యు : పడననే మనవి చేసుకుంటాను. పైఁగా అంత అనాలోచితంగానూ పేలవంగానూ విమర్శించడమే కాకుండా "చాకలిచే జవాబు చెప్పించడమంటే, ఆ విమర్శించే పుస్తకం పెంటమీఁద దొరికిందంటే, చచ్చుతర్కమంటే, పుచ్చు తర్కమంటే" యెన్నో అప్రగల్భోక్తులు కూడా వాడివున్నారు. అవిచూచినప్పుడు నేనెంతో నొచ్చుకునేవాణ్ణి. శాంతివ్యాసంలో యీ అంశాన్ని సూచించే వున్నాను. చిత్తగించే వున్నారుకదా?

గురు : అట్టి మాటలన్నియు, అవసరమును బట్టియే వాడియుందును. నీవు నొచ్చుకొనుటకేమిలే. పరోపదేశవేళయం దందఱును మిన్నలే.

శిష్యు : యీ మాట యిదివఱలో “శృంఖలం" లో నన్నుఁగూర్చి వాడిందే. పైఁగా దానిలో కామేశ్వరీశతకాన్ని కూడా తమరు యేదోవిధపు కవిత్వంగా నిర్ణయించారు. యిట్టిపోకడ యిదివరకు కవితా ప్రపంచంలో లేనేలేదని శ్రీజయంతివారు లోనైనప్రాజ్ఞులు మెచ్చుకొన్న గీరతాన్నిన్నీ తమరు యెట్లోయీసడించి వున్నారు. ఆయీవిషయాలు “ముక్త్యాల" వ్యాసంలో కొద్దిగా వ్యాఖ్యానం చేసే వున్నాను. కాని "శృంఖలంలో" నన్ను తాము యింకా యెంతనికృష్టంగా అనుగ్రహించారో దాన్ని యావత్తూ మాత్రం కనపఱచలేదు. దాన్ని మళ్లా ప్రకటించుతామని గురువుగారు "చెఱలాటం"లో వక్కాణించడం చేత నేనుమానిన విషయం కూడా తమద్వారాగానే లోకానికి తెలుస్తుందిగదా? అని సంబర పడుతున్నాను.

గురు : నీ సంబరమున కేమిలే, శృంఖలమును ప్రకటించి తీరుదును.