పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/855

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురు శిష్య ప్రశ్నోత్తరములు

959

శిష్యు : యెందుకు మనవిచేస్తూ వున్నానో బాగా ఆలోచించండి. శృంఖలాన్ని మాత్రం ప్రకటించకండి. లోకం కేసి దృష్టి ప్రసరింపఁ జేయండి.

గురు : నాకు లోకముతోడను, గీకముతోడను పనిలేదు. ప్రకటింతును.

శిష్యు : యిటుచిత్తగించండి. లోకమంటే మనవి చేస్తూన్నాను. శ్రీకాంచన పల్లె కనకమ్మగారు మనవుభయులకును మాననీయురాలేకదా? ఆమె "యీతని పాదమ్ములు గొల్తు రేన్గుపై నెక్కుకవుల్" అని వక్కాణించింది. యెన్నాళ్లనుంచో మీచే సంశయింపఁబడుతూవున్న నా గురుభక్తి ఆబిడ కెందుకు నచ్చిందో విచారించండి. ఆ సభలోనే శ్రీ దేశోద్ధారకు లేమంటూ వున్నారో? తిలకించండి. "సుగృహీత నాములగు శ్రీ శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రులవారికి గురువులగుటచేతను అగ్రపూజ కర్హులు" అన్నారు. తాము నాశిష్యత్వంవల్ల వచ్చే గౌరవం లేశమున్నూ లేదన్నారు "శృంఖలం"లో, పైవారు మీ యెడల వకభావమూన్నూ నాయెడల వక భావమున్నూ కలవారు కారని లోకంతోపాటు తామున్నూ అంగీకరిస్తారని నా విశ్వాసం. మనమూ మనమూ యేం వ్రాసుకున్నా లోకాన్ని చూస్తూ వుండాలని నామనవి. లోకానికా శృంఖలం బొత్తిగా రుచించేది కాదు. కాఁబట్టి ప్రకటించవద్దని మనవి చేసుకుంటూ వున్నాను. మీకు పదివేల నమస్కారాలు, నా మనవి చిత్తగించండి.

గురు : (తొందరగా) నీకు పదికోట్ల ఆశీర్వచనాలు దానిని ప్రకటించి తీరుదును.

శిష్యు : యింక యితరధోరణిలోకి వెళ్లకండి. ఆ ఆశీర్వచనాలు ప్రసాదించండి. యింతటితో మన వాదోపవాదాలు ముగించుకుందాము. లోకం యొక్క అభిప్రాయం అలా వున్నట్లు వుత్తరాలు వస్తూవున్నాయి.

గురు : (తనలో) ఓహో? యిది తుట్టతుదకు “ముద్రారాక్షస" నాటకము వలె పరిణమించుచున్నదే, నిజానికి వీఁడు అంతఃకరణశుద్ధికల శిష్యుఁడు. నేను వీనియెడల నపోహ పడినట్లు విస్పష్టమగుచున్నది. కావున నాశీర్వదించెదఁ గాక. (ప్రకాశము) నిరోగశతాయుష్య మస్తు. వంశాభివృద్ధి రస్తు. సర్వశ్రేయస్సమృద్ధిరస్తు......."

శిష్యు : (వినయముతో దోసిలియొగ్గి) పరిగృహీతం శిరసా తీర్థపాదాశీర్వచనమ్.