పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/844

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

948

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

గురు : 1916 సం|| రములో బందరులో నీనిమిత్తమున జరిగిన మహాసభకు నే నధ్యక్షుఁడుగా వచ్చినపుడు, ఆ సభలో నన్ను రహస్యముగా పిలిచి నీవే మంటివి? జ్ఞప్తి యున్నదా?

శిష్యు : లేకేమి? మొన్న తామాయీసంగతులన్నీ “చెరలాటం"లో వుదాహరించారు కూడాను. తమ్ము రహస్యంగా పిల్చి "అయ్యా యీ సభలో నన్ను మీ శిష్యుడని చెప్పండి. బహువచనంగా సంబోధించకండి" అని సవినయంగా మనవి చేసుకున్నాను.

గురు : (తమలో) యిది మాత్రము శిష్యునికేమి బాధించెడిని. మిక్కిలి వినయవంతుc డనియు, ఆ వినయము కూడా అంతఃకరణశుద్ధికలదియే యనియు తేల్చెడిని. పైఁగా, చెరలాటములో దీనిని నే నెందుకెత్తుకోవలెను? సరి? బాగుగనే యున్నది నా ధోరణి. కొన్ని విషయములు తుదకు నిల్చినను నిలువకున్నను అడుగుటకేని యవకాశము కలవిగా నున్నవి. యిదియో? అట్లును లేదే? (ప్రకాశము) నీవు మాత్రము తఱచుగా నన్ను గురువుగారు, గురువుగారు, అని ప్రతిచోటను చెప్పుచుందువు, నాకేమో నిన్ను శిష్యుఁడని చెప్పుటకు సిగ్గుగా నుండెడిని. నీ మాటలయందంతఃకరణశుద్ధి లేకపోవుటయే దీనికి కారణ మనుకొందును.

శిష్యు : యిదంతా యిటీవల తామభిప్రాయం మార్చుకోవడంవల్ల కల్గిన విశేషమే. కొల్లాపురమే సర్వానికిన్నీ మూల మనుకుంటాను.

గురు : దానికేమిలే, నీ శిష్యత్వము అంతఃకరణశుద్ధి కలదే యగుచో నే నేదేని సభలో నొకమాటేని వాక్రుచ్చియుండనా?

శిష్యు : అదిన్నీ జరిగింది, తమకు జ్ఞాపకం లేకపోవచ్చు. “చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి నా శిష్యుఁడు, అతఁడు నా యెడల పితృవాత్సల్యత చూపుచు.......... "

గురు : (తొందరతో) ఆఁగు, ఆఁగు. పెండ్యాలవారి కేసులో నుండి కాదు నీ వుదాహరించుట. పండితాభియోగమని అచ్చుపడ్డది కాఁబోలును ఆ కేసు విచారణ. సరే? అది మహాసభ కాదుగదా! మేజిస్ట్రీటుకోర్టు,

శిష్యు : మహాసభకన్నా కోర్టుకే గౌరవ మెక్కువేమో? కోర్టులో చెప్పే మాటలన్నీ ప్రమాణం మీఁద చెప్పాలి కదా? మహాసభలో నట్లు కాదు.