పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/843

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

947


గురు శిష్య ప్రశ్నోత్తరములు

(వ్రాత ప్రతినుండి)

గురు : అబ్బాయీ? నిన్ను కొన్ని ప్రశ్నములడుగఁ దలఁచితిని.

శిష్యు : చిత్తం. యెఱిఁగినంతలో ఉత్తరం మనవి చేసుకుంటాను.

గురు : పాలకొల్లుసభలలో నెందేని మా అమ్మాయి కవిత్వము చెప్పునది కాదనియు, తండ్రిగారే చెప్పి యాపెపేరున ప్రకటింతు రనియు నర్ధము ధ్వనించునట్లు పన్యసించియుందువా? లేదా?

శిష్యు : అట్టి యపోహ నా కుంటే గదా? అలాటిధ్వని వచ్చేటందుకు? లేదని గుళ్ళోలింగాన్ని పీఁకమంటే పీఁకుతాను.

గురు : మొల్లను గూర్చి యైన నిట్లు మాటలాడితివా?

శిష్యు : మొల్లకు తండ్రిగాని సోదరులుగాని కవులైనట్లు ప్రతీతి యెక్కడా వున్నట్లే లేదు గదా? యిట్టి యపోహ మేలాగు?

గురు : పోనీ ఆపెజోలి మన కెందుకు? మా అమ్మాయిని గూర్చియే మఱియొకసారి అడుగుచున్నాను.

శిష్యు : మఱియొకసారి కాదు, వేయిసార్లడగండి.“కవులకూఁతుళ్లు కూడా కవిత్వం చెప్పడం కలదు. శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రుల్లుగారి కొమార్త యిందు కుదాహరణం" అని భావ సం|| మార్గశీర్ష బ 2 శనివారంనాటి కృష్ణలో వ్రాశాను కూడాను.

గురు : దాని నటు లుంచుము. నా భారతమును గూర్చి విశేషించి నాఁడు పాలకొల్లులో నీవుపన్యసించలేదేమి.

శిష్యు : ఉపన్యసించాను. ఆ సభలో సభ్యులరంజనకయి యితరమున్నూ మాటలాడాను. పాలకొల్లు వ్యాసంలో యీ యంశం గతార్ధ మవుతుంది మళ్లా యిక్కడ పిష్టపేషణ మెందుకు?