పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/842

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

946

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

“సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే" కదా! అయితే నీకేమీ అపకీర్తి వచ్చిందంటారా? వినండి. జాతకచర్యలో వున్నదున్నట్టుగా విద్యాభ్యాసాన్ని గూర్చే కాదు యెన్నో విషయాలు వ్రాసుకొని వున్నాను. గురువుల వారు హైదరాబాదుకు కోపోద్రేకంతో వ్రాసిన వుత్తరం వల్ల నేను కాజులూరు, చామర్లకోట, పిల్లంక, పల్లెపాలెం, యిన్నివూళ్లల్లో చదువుకొన్న చదువు, చేసుకొన్న వారాలు, యెత్తుకొన్న మాధాకవళం అనుభవించిన కష్టసుఖాలు, తిన్న మొట్టికాయలు, యివన్నీ గంగలో కలిసిపోవడమే కాకుండా, వెం|| శా|| వట్టి అబద్దీకుడు. వక్క గురువుదగ్గిఱ చదివిన చదువును యిందఱికి పంచిపెట్టి వ్రాశాడంటూ నా శత్రుకోటి నన్ను నా జీవితకాలంలోనున్నూ అటుపిమ్మటానున్నూ ఆక్షేపించడానికి కారణం కాదా? నా జీవితకాలంలో యేలాగయినా తరువాత యీ అపవాదునుబట్టి నా కొడుకులకు తలవంపు రాదా? చూడండి. పాపం. ఈ మధ్య జగదేక పండితులు శ్రీ ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రులుగారిని ఎవరో వృథాగా పనిలేనిపాటుగా అధఃకరించి వ్రాసినందుకు మిక్కిలి పరితాపపడుతూ ఆయనకుమారుడు వెంకటశాస్త్రిగారు “నివేదనం” అనే పేరుతో కొన్ని పద్యాలు ప్రచురించారు. అవి చదివేటప్పటికి నాకు కళ్లమ్మట నీళ్లు బొటబొట రాలడం మొదలెట్టాయి. అలాగే యీ అపవాదాన్ని నేను తొలగించుకోకపోతే యిదిముందు నాకుఱ్ఱలకు తలవంపు తేదా? అందులో సామాన్యులు ఆరోపించిందికాదాయె, గురువులవారిది కదా? ప్రభాకరశాస్త్రిని సుబ్బరామయ్యగారు యెఱిగేవుంటారు. అతణ్ణి వక విషయంలో గురువుల వారు అసత్యవాదినిగా వ్రాశారు. పైఁగా యిప్పుడు భారతంకాబోలును నెత్తిని బెట్టుకొని ప్రమాణం చేయవలసిందిగా విధిస్తూ వున్నారు. యీలాటివి యెన్నో అనుచితాలు వారి వ్యాసాలలో వున్నాయి. నాదానిలో లేవని నా నమ్మకం. విద్యావిషయంలో నేను గురువులకన్న యెక్కువ శుశ్రూష చేసినట్లు వ్రాసినమాట సత్యం. దాన్ని ధ్రువపరచడానికి తగ్గప్రసక్తి గురువుగారే కల్పించివున్నారు. యింకా ముందుకూడా కల్పించే వూహతో వున్నారు. ఆ సంగతి యెంతవఱకు సత్యమో! భగవంతుడు తిన్నగాచూస్తే త్వరలోనే తేలుతుంది. ఇంతకన్న అనుచితంగాని అవాచ్యంగాని అయోగ్యంగాని నా వ్రాఁతలోవుంటే చూపవలసిందని సుబ్బరామయ్యగారిని ప్రార్థిస్తాను. నాతప్పు నాకు గోచరించదు గనుక యీ ప్రార్థనం. దీని మీద వారు వూరుకుంటేకూడా నా అభిప్రాయాన్ని బలపఱిచినట్లే నేను సంబరపడవలసి వస్తుంది. ముగిస్తాను.

★ ★ ★