పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

940

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యిటీవలనేనా సవరించడం శ్రీవారి జీవితాన్ని అలంకరిస్తుందనిన్నీ విన్నవించుకుంటాను. యిఁక ప్రస్తుతాన్ని ముగిస్తూ నేను యిదివఱలో గురువులవారిశంకలకు యిచ్చినటువంటిన్నీ యీ వ్యాసం తుట్టతుదను బహుసంగ్రహంగా శ్రీవారి భారతాన్నుంచే యివ్వఁబోయే టటువంటిన్నీ సమాధానాలను గూర్చివారి అంగీకారానంగీకారాలు తెలుప వలసిందని పునఃపునః మనవి చేసుకుంటాను. యిద్దఱమున్నూ వార్ధక్యంలోనున్నూ అనారోగ్యంలో నున్నూ వున్నవారమే కనుక తక్కిన పొడిమాటల వాదానికేంగాని విద్యావిషయికమైన యీ వాదాన్ని తేల్చుకోవడానికి తగ్గ ఆయురారోగ్యాలని యిమ్మని మా యిలువేల్పును ప్రార్ధిస్తాను.

చ. గురువులు నాకునిప్పు డొక గొప్పపనిం గలిగించినారు, వే
    గిరపడినంతఁ దేలదది కేవలసారవిహీనమయ్యు, నీ
    కరుణయొకింత నాపయినె కాక గురూత్తమునందు జూపి సా
    కిరివయి చూడు మిర్వురకు గీర్తియు నాయువుఁ బెంపు మీశ్వరీ

క. వాది ప్రతివాదులలో
    రాదుగదాకీర్తి ఇర్వురకు నందువొ? నా
    “చేదస్తపు" నుడి యెట్లో
    నీదయచే యుక్తమగుచు నెగడుంగాతన్ !

క. గురువు లడుగుట శిష్యుం డు
   త్తరమిడుటయుఁ బ్రాజ్ఞు లొప్పు ధర్మమ, తగు ను
   త్తరమిచ్చినప్డు మెచ్చెడి
   గురునకు శిష్యునకు యశము కొదవగునొక్కో?

క. తగునుత్తర మిచ్చెడివా
    నిఁగ నన్నున్, గురుని దాని నిజము తెలియు వే
    త్తఁగఁ జేసి యాయురారో
    గ్యగరిమ హెచ్చించి మ్రొక్కు కైకొను మంబా !

క. వెనుక మము వెక్కిరించిన
    మొనగాండ్రకతాన లోకమున కేమో మే
    లొనఁగూడె నందు రిపుడును
    జననీ! తాదృశయశః ప్రసాదినివగుమీ !