పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/834

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

938

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అప్పుడు శిష్యులవల్ల లోకానికి ఆయీరహస్యాలు వెలిపుచ్చవలసివచ్చింది. యిప్పుడో, గురువుగారి పుణ్యమా అని, కొన్ని రహస్యాలు బయలుపడతాయి. నా కవిత్వాన్ని తప్పులంటూ వ్రాయడం బాగానే వుంది కాని నామీఁద వృథాదోషారోపణ చేసి శాపాలు పెట్టడం గురువులవారి అమాయికత్వాన్ని మఱింత బలపఱుస్తుంది. ఇతరుల సందర్భంలో నేను స్పష్టంగా వాడిన “ఆసీమాంత" పదాన్ని గురువులు తమమీఁద పెట్టుకోవడం మిక్కిలి శోచనీయం. గురువులు కోపోద్రేకంచేత నాకున్నూ వారికిన్నీ సందర్భించిన శుశ్రూషను అన్యథాగా వ్రాశారని నేను వ్రాస్తే దానికి "వొళ్లు తెలియక వ్రాశా" రని నేనన్నట్లు వ్యాఖ్యానం వ్రాసుకున్నారు గురువుగారు. సత్యంకోసం నేను పెనుగులాడుతూ వున్నప్పటికీ వెం||రా|| లవలె హెచ్చుతగ్గు మాటలు వ్రాయడం నాపనికాదు. గురువుగారు సరియైనతోవలో కలాన్ని నడిపించడంలేదు. నిన్నగాక మొన్న కాఁబోలు శ్రీదేశోద్ధారకులు "సుగృహీతనాములగు శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారికి గురువులగుటచేతను అగ్రపూజ కర్హులు" అని వ్రాసిన సంగతి యెఱిఁగివుండిన్నీ ఆ సభలోనే శ్రీకాంచనపల్లి కనకమ్మగారు తమ్ముస్తుతిచేసిన “యీతని పాదమ్ములు గొల్తు రేన్గుపయి నెక్కుకవుల్" అనే వాక్యాన్ని వినివుండిన్నీ నాశిష్యత్వాన్ని తృణీకరించడం యేమనుకోవాలి? అట్టినే నేమి, నాకవిత్వమేమి, క్షణంలో పనికిమాలినవయినట్లు వ్రాస్తారు గురువరులు. యెవరో యెవరినో పడఁదిట్టి అందులో తమకేమో మెహర్బాని సంఘటించడానికి వ్రాసిన వకదూషణ పుస్తకాన్ని ధారాశుద్ధిలేని పుస్తకాన్ని తెగపొగిడి రాస్తారాయె, ఇదంతా అమాయికత్వంగాక యేమనుకోవాలి?

షష్టిపూర్తి సందర్భంలో వెం||శా|| ని సమ్మానించిన సమ్మానించడం ఆంధ్రలోకాని కంతకున్నూ సమ్మానించడంగా పండిత లోకం అంగీకరించుగాక అని వ్రాసిరి. నేఁడు శుంఠ వెంll శాII అని వ్రాస్తూవుండిరి. శత్రుత్వమే వుందనుకుందాం వుంటే మాత్రం వ్రాఁతలో గాంభీర్యం వుండవద్దా? రామునికి రావణునిమీద శత్రుత్వం లేదా? అయితే మాత్రం గాంభీర్యాన్ని కోలుపోయినాఁడా? రాముఁడు చూడండి యేమన్నాడోను! "ఓయీ! నీవు కులమందుఁగాని బాహుబల మందుగాని మిగులపేరెక్కిన వాఁడవు. యిట్టివాఁడవై యుండిన్నీ దొంగతనంగా నా భార్యను అపహరించడం శూరులు మెచ్చరని తెలుసుకోలేక పోయావు. ఆయీ నీ అకార్యాన్ని బ్రహ్మ మొదలగు నీకూటస్థులు విని మిక్కిలీ నొచ్చుకుంటారుసుమీ" అని అన్నట్టు మురారి కవి వ్రాసివున్నాఁడు. అంతేనేకాని “కుండంతా వోటిగా" వ్రాసే వ్రాఁతకూడ వక వ్రాఁతేనా? నేను గురువుగారి భారతం యావత్తూ అసారమని వ్రాయలేదే? వారికింత కోపం యెందుకో? యేకొంచెమున్నూ అసారంగా వుండకుండా కవిత్వం చెప్పేవాళ్లంటూ స్వర్గ మర్త్యపాతాళలోకాల్లో యెక్కడేనా యెప్పుడేనా వున్నట్లు విన్నామా? వింటామా?