పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/829

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

933


గురువుగారు వట్టి అమాయికులు

(20-6-1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

అని సరిపెట్టుకోవడమేతప్ప, యిప్పుడు వారు నన్ను అధఃకరించడానికని వ్రాసేవ్రాఁతలను అన్యథాగా సమర్ధించడానికి నాకు లేశమున్నూ మార్గం కనిపించడంలేదు. వకమాటేమో, వెం|| శా|| కాకరపర్తిసభలో వోడిపోయాఁడని వ్రాసి తృప్తిపడతారు. యింకొకమాటేమో, అవధానం వకమాటున్నూ సంపూర్తిగా చేయకుండానే శతావధాని బిరుదాన్ని పెట్టుకున్నాఁడని వ్రాసి సంతుష్టి సూచిస్తారు. మరొకమాటేమో, బాలసరస్వతీ బిరుదం వుండడంచేత ధర్మశాస్త్రప్రకారం శ్మశానవృక్షమై పుడతాఁడనిన్నీ గురుధిక్కారం చేశాడుకనక నూఱుసార్లు కుక్కగా పుట్టడమేకాకుండా ఆ తర్వాత చండాలుఁడుగా పుడతాడనిన్నీ వ్రాసి సంతోషాన్ని ప్రకటించుకుంటారు. యింకా యెన్నెన్నో యిట్టి సందర్భాలు వ్రాసి వారు వారి సంతృప్తిని లోకానికి తెలుపుతూ వున్నారు. “యేడుకఱవు లొస్తా" యన్నట్లు ఆయీ వ్రాసేసందర్భాల్లో యే వకటిరెండో వెం|| శా|| పనికి మాలిన పంద అని సమర్థించడానికి చాలవూ? యిన్నిటిని ప్రకటించడమెందుకో? అని నే ననుకుని, వోహో! యిది గురువులవారి అమాయికత్వాన్ని తెలుపుడుచేసే సందర్భం అని సమాధానం చెప్పుకుంటూవుంటాను మళ్లాను.

గురువుగారు వ్రాసే వ్రాఁతథోరణి పరిశీలిస్తే వెంకటశాస్త్రికి కర్మం చాలక యేవ్యక్తివల్లనేనా యే మాత్రం ధిక్కారం జరిగినాకూడా సంతోషించే స్థితికి వచ్చినట్లు కనపడుతుంది. అలాగేకాకపోతే, యెవరో ఆచార్లగారు పాపం, కవిత్వరచనమంటే యేమిటో బొత్తిగా యెఱగనివారు, ఆంధ్రమంటే అసలే తెలియనివారు, తి|| వెం|| కవులను వెక్కిరించి “గిల్లికజా" తెచ్చుకుంటే, ఆయన ఆక్షేపించిన ఆక్షేపణలనున్నూ ఆయన ఖర్చుపెట్టిన దురుక్తులనున్నూ తమ పుస్తకంలో చేర్చుకొని పరాక్రమిస్తారా? అట్లు పరాక్రమించి తరించడానికి ప్రయత్నిస్తూవున్న గురువుగారిని అమాయికు లనుకోవడం కన్న మార్గాంతరం కనపడదు.

ఆ ఆచార్లగారి ఆక్షేపణ మచ్చుకు వకటిచూపుతాను. “ఢిల్లికి ఢిల్లే పల్లికి పల్లే" అన్న సందర్భంలో ఆచార్లగారు మా గురువులకన్నను అమాయికులు గనుక “పామరుల