పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/810

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

914

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సరిపెట్టుకున్నారు. ఈ ఆంధ్రదేశంలో యింకొక రెవరేనా ఆయన వ్రాఁతను గూర్చి "అవివేక" పదాన్ని వుపయోగిస్తారేమో? వేలు మడిచి చూపండి? యీలాటి శంకకు సమాధానం కనపడకే నేను గురువుగారి తరఫున పూనుకొని దాని ఖండన కుపక్రమించక పోయింది. యీ మాట నేను ఆత్మవంచనచేసి చెప్పేమాటకాదు. ఆత్మవంచన నాకు బొత్తిగా చేఁతకాదు. యీ విషయం నేను వక వ్యాసంలో లోకానికి ప్రత్యేకించి విన్నవించుకున్నాను. కావున యిక్కడ విస్తరించేదిలేదు. ముమ్మాటికిన్ని కృష్ణరావుగారి సంపాదకీయాన్ని నేను ఖండింప లేదన్నది నా అసమర్థత్వ ప్రయుక్తమే. ఆయన నాకు పరమ మిత్రుఁడని గురువుగారు వ్రాయఁబోతారేమో? లాభం లేదు. సుమారు 25 యేండ్లనాఁడు గుంటూరు సీమ కలహాలలో యీ మహానుభావుఁడు పనిగట్టుకొని తమ పత్రికలో మూఁడు కోడిపుంజు బొమ్మలను చిత్రింపించి అందులో వక కోడిపుంజు మెడలో నా మెడలో వుండే గౌడ రుద్రాక్షతావళాన్ని తగిల్చి నన్ను లోకానికి ప్రదర్శించలేదా? అట్టి కృష్ణారావుగారిని నేనెప్పుడైనా మరుస్తానా? అయితే నిజం వప్పుకోవడం మనిషికేకాదు, ప్రతి మనస్సుకున్నూ సహజగుణం గనుక నాలో నేను విమర్శించుకుని ప్రస్తుతం మనం న్యాయానికే అనుకుందాం కలహిస్తూ వున్నమాట సత్యమే. ఆ కలహంకూడా స్వకీయజాతి అయిన కవిజాతితోటి. కోళ్లుకూడా అట్లే కనుక యుక్తంగానే వుంది వుపమానం అని సరిపెట్టుకున్నాను. అంతతోకూడా వూరుకోక నెమ్మది మీఁద గుంటూరు సీమలోకొంత సమాధానం మృదువుగాచెప్పి విరమించాను. పిమ్మట నన్నుఁగూర్చి చాలామంది వ్రాసిన వ్రాఁతలున్నూ కృష్ణా పత్రికవారివున్నాయి. అవిచూస్తే, “కొట్టితే కొట్టేఁడు” అన్నట్లుంటాయి. యింతకూ సారం కోడిపుంజుగా చిత్రించిన కృష్ణరావుగారు నాకు మిత్రులున్నూ కారు కవిసార్వభౌమ, కనకాభిషేకాలను ఖండించిన కృష్ణారావుగారు గురువుగారికి శత్రువులున్నూ కారు. యిఁక యెవరవుతారో? లోకులే నిర్ణయించుకోఁగలరు. ఆ మాట యీమాట అనే వివక్షతో లేశమూ పనిలేకుండా నా విషయమై కోపం యేలా నడిపిస్తే అలాగల్లా కలాన్ని గురువులు నడిపిస్తూవున్నారు. నేనాలా నడపనూ నడపను. నడపడానికి నాకధికారమున్నూ లేదు. యేదైనా శబ్దమో సమాసమో నాది తప్పని గురువులంటే దాన్ని గూర్చి యేకొంచెమో వ్రాస్తే వ్రాస్తాను. అదిన్నీ నిజానికి వ్రాయ నక్కరలేదు. యీవాదోపవాదాలు పాండిత్యపు బలాబలాలకి సంబంధించినవి లేశమున్నూ కావు. వెం. శా.కుమార సంభవం మొదలుకొని మాఖం వరకున్నూ వక గురువుగారి వద్దనే చదివి నాఁడా? లేక అయిదారు గురువుల యొద్ద చదివినాఁడా? అన్న అంశం తేల్చుకోవడానికి యేర్పడ్డది. రెండవ గురువుగారు తమ వద్దనే చదివినట్లు వకరికి వ్రాశారు వుత్తరంలో, అది పత్రికలకెక్కింది. అచ్చుపడ్డ