పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/809

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిలేనిపాట

913


గ్రంథం తెనుఁగులోకి పరివర్తన చేసింది భారతంవుండఁగా పేరు చిరస్థాయి కావడానికి యీలాటివెందుకని నాశంక. కవిపేరు నిలిపితే కవిత్వమేనిలుపుతుంది. అదిరసవంతమైన దయితేనే -

"లోకుల రసనలె యాకులుగా నుండునట్టి యవివో కవితల్" అన్నాఁడు సంకుసాలకవి. కర్మిష్ఠత్వాదులు కవితారసాన్ని తెచ్చిపెట్టవు. తగ్గిస్తే తగ్గిస్తాయేమొయింకాను.

తే.గీ. ఎంత దూరమో? యెందులకెవరు? జాఝ
       వా, యను కవి ప్రవరుఁడు కవనమునందు
       వానిఁబోలెడువారె? యెవ్వారలేని
       విప్ర కవులందు నెవ్వరో? వేత్తదక్క

అని యిటీవలిచర్యలో వక ఘట్టంలో వ్రాసివున్నాను. సార్వభౌమ బిరుద సభను కొంత వర్ణించారు గురువుగారు. ఆ సభలో నేఁటికవులలో ప్రసిద్దులు పలువు రుండడం అవసర మంటాను నేను. గురువులవారు నీవు అని నన్ను వుద్దేశించి యియ్యది నిన్ను గూర్చివ్రాసేమాట అంటారేమో? నాలక్ష్యం లేశమున్నూ లేనట్లున్నూ నాకవిత్వం పనికిమాలిన కవిత్వమైనట్లున్నూ వ్రాస్తూయున్న గురువుగారికి నాభయం వుంటుందని నే ననుకుంటానా? అదిన్నీ కాక నెలలయితేనేమి, వారికి మళ్లాజ్ఞాపకం వచ్చిన ప్రకారం సంవత్సరాలయితేనేమి వారివద్దనేను శుశ్రూషచేసిన శిష్యుణ్ణయినప్పుడు వారి సార్వభౌమత్వానికి నా అడ్డేంపని చేస్తుంది. అందుచే ఆ సభలో నేను లేనన్నది బాధకంగాదు, సాధకమున్నూ కాదు. ఆ బిరుదు రాజులకు రాజసూయాధ్వరం యెట్టిదో? కవుల కట్టిదిగా తలఁపక తప్పదు. అందుచే అశ్వంలాగా కవిత్వం కూడా తిరిగి పట్టుపడకుండా స్వస్థాసాన్ని చేరుకోవాలి. అట్టి శక్తివుంటే తప్పు లేనప్పుడు తమ ప్రయత్నం మీఁద కాదే అనుకుందాం, యితరులు బలవంత పెట్టియిచ్చినా ఆలోచనాపరులు ధరించరు. అందుకే "కృష్ణ" ఆక్షేపించింది. లేకపోతే దాని పుట్టేం మునిగింది? ఆ పత్రికా సంపాదకుఁడేమిన్నీ తెలియనివాఁడు కాఁడు. అస్మదాదులతోపాటు ఇంచుమించు ఆంధ్రగీర్వాణాదులలో ప్రవేశంకలదు. ఆయనకు వకరిని అవమానించే స్వభావంలేదు. అందులో దేశాభిమాని అవడంవల్ల ఆంధ్రదేశమన్నా ఆంధ్రకవులన్నా ఆయనకు విరుద్ధమయిన అభిమానం. యీ సార్వభౌమ, కనకాభిషేక ప్రసక్తికి కొంచె మీవలా ఆవలా జరిగిన సమ్మానా లెన్ని లేవు? వాట్లను గూర్చి లేశమైనా ఆయన వ్యతిరేకంగా వ్రాశారా? వీట్లను గుఱించే వ్రాయడమేమి? యీ సందర్భం విచారించవలసిన అంశం. ఆయన వ్రాఁత అవివేకపు వ్రాఁత అని గురువుగారు