పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/802

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

906

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గురువుగారి భారతం అసారమనేవారికి ఆధార భూతమైన పద్యాల్లో మొట్టమొదటిదేమో అనఁదగ్గ పద్యాన్ని "స్త్రీ స్వాతంత్ర్యము" అనేదాన్ని నేను ప్రసక్తానుప్రసక్తంగా నాగీరతం గురువుగారు యీసడించిన సందర్భంలో కాఁబోలు వుటంకించాను. దాన్ని సమర్ధించారు గురువుగారు. యెల్లావుందంటారు? ఆసమర్ధనం సమంజసమా? కాదా? అన్నది నాకు ప్రస్తుతం కాదు. అది లోకంపని, అంతతో తృప్తిపడక నా “బొబ్బిలి పట్టాభిషేకం" లో "స్త్రీలనుగూడ" అన్న పద్యాన్ని పట్టుకొని విమర్శించి కోపం తీర్చుకున్నారు. గురువుగారేమో అంటే నేను జవాబువ్రాసి పత్రికకు పనికల్పించాలా యేమిటి? దాన్నిన్నీ వుపేక్షిస్తాను, అసమర్థుఁడ వంటారేమోఁ గురువుకన్న శిష్యుఁడు అసమర్ధుఁడుగా వుండడమే యుక్తం కదా? వారికోసంగాదు. లోకంకోసం. జవాబు చెప్పరాదా? అంటారా? అయితే కొంచెం వ్రాస్తాను. “స్త్రీలను అనే సప్తమ్యర్థక ద్వితీయ తప్పన్నారు గురువుగారు. "సీ....... మనుజుల విప్రుండు” అనే శాంతి 1. ఆ. వల్ల అది సాధువు. “భారతమాంధ్ర సత్కవుల పాలిటి వేదము" దేవీ - 1. ఆ గురువుగారు గనుక యింతకన్న వ్రాస్తే బాగుండదను కొందును. కోపోద్రేకం మీఁద సరియైనవి దొరకలేదుగాని శాంతించి మెల్లగా వెతికితే తి|| వేం|| కవుల కబ్బాలలో గురువుగారికి దురుద్ధరమైన దోషాలే దొరక్క పోయాయా? కోర్కెలు కూడా రైటే “క|| కేదారము లందుఁగోరి కెలుదయివారన్" తపతీసంవరణము, “తే||గీ|| గీము లలరించి కొనిరి కోర్కెలు చెలంగ" నీలాసుందరీపరిణయంలో తిమ్మకవి సార్వభౌముడు. యింకా కొన్ని ఆక్షేపించారు. ప్రౌఢవ్యాకరణం - చూస్తే కొంత సంశయం తీరుతుంది. యీ వివాదం సత్యము తేల్చుకొనుట కేర్పడ్డదిగాని గురువుల ప్రజ్ఞయెట్టిది! శిష్యుల ప్రజ్ఞ యెట్టిది అనే అంశం లోకానికి తెల్పడానిక్కాదు కాఁబట్టి సృశించి వదలినాను. అవసరమే అయితే గురువుగారి పునీత ప్రయోగానిక్కూడా సమర్థించే సరకు నావద్ద వున్నది. యెప్పుడో దాన్ని యెవరో ఆక్షేపించారు. గురువుగా రింతవఱకూ “గురోస్తుమౌనం వ్యాఖ్యానం" గానే వున్నారు.శ.ర. నిఘంటులో వుందిగాని తావన్మాత్రం చేత అది సమర్ధింపఁబడదు. గురువుగారి సెలవైతే ఆవలి వారితో కొంత పెనుగులాడతాను. యెప్పుడేంపని పడుతోందో! అని కొంతసరకు దాఁచి వుంచాను. దాని ప్రయోగం గురువులమీఁదే జరపవలసి వచ్చినందుకు విచారిస్తూవున్నాను. “కాదని తప్పుదిద్దమా! ఉభయులోన నొక్కఁడు మఱొక్కనికిం దగుఁగాక” ఉభయులూ అంటే జ్ఞాపకం వచ్చింది నేను జీవితచరిత్ర వ్రాస్తూ తి||శా|| గారి నేమోఁ యేమోచేయడానికి చాలా చమత్కరించానఁట! యీలా వ్రాయడ మెందుకంటారా? అతని కొడుకులకూ నాకూ వివాదం కల్పించడానికి. వాళ్లంత అవిమృశ్యకారులయితే చూస్తాను. యింకాయెన్ని! మా శిష్యులకు సంబంధించినవాదం, గుంటూరి సీమలో వచ్చినవాదం, యివన్నీ ఆవలివారివే న్యాయమైనట్లు వ్రాశారు