పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/800

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

904

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఆయనకు కష్టక్లుప్తిమీఁద తప్ప తేలికగా చేవ్రాలు చేయడం కూడా బాగారాదు. కాని వినికిమీఁదన యేదేనా వచ్చే బుద్ధిచుఱుకు మాత్రం వుంది. చిన్నప్పుడు వీథిభాగవతాల వినికివల్ల కొంత గాలిగా సంగీతం పాడడం అభ్యాసముంది. పిమ్మట కుటుంబ సంరక్షణ జరగక వ్యవసాయం కట్టిపెట్టి యానాం గ్రామం కాపురానికి వెళ్లిన తరువాత అక్కడ శివ విష్ణ్వాలయాలలో జరిగే సేవలకు తఱుచు సంగీతం పాడడానికి వెళ్ళే సందర్భంలో ఆ దేవాలయాల్లో వినికివల్ల కొంతమంత్రపుష్పం ఆయనకు ధారణకు వచ్చింది. మరణ సమయానికి పురాకృత సుకృతంవల్ల ఆ మంత్రపుష్పంలో “నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా, తస్యాశ్శిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః" అనే ఘట్టాన్ని యేకరుపెట్టి అసకృదావృత్తి చేయడమున్నూ, యేకాదశి మరణాన్ని పొందడమున్నూ నేనేకాక మా బందుగులలో కూడా కొందటెఱుఁగుదురు.

అదివఱకే నాకు సత్యమంటే అభిలాషమెండు. దాన్నిఁబట్టే నేను గీరతం గుంటూరిసీమలో వ్రాయడం తటస్థించింది. మాతండ్రిగారి సందర్భం చూచింది మొదలు నాకు దానియందు మఱీ ఆసక్తి హెచ్చింది. దాన్ని యెంతవఱకు నెఱవేఱుస్తూ వున్నానో ఆ సందర్భం లోకులు నా జీవితానంతరం తేలుస్తారు కాఁబట్టి యిక్కడ విస్తరించవలసింది లేదు. యిక్కడ కావలసింది చెళ్లపిళ్లవంశానికి, అందులో మాకడియం చెళ్లపిళ్లకు అసత్యమంటే చేఁతకాదు. అందుచేత ఆత్మవంచన బొత్తిగా చేఁతకాదు, అన్నది ముఖ్యాంశం. యింతయెందుకు వ్రాస్తానంటే వైదికవంశంలో వాఁడనైనా మా వంశంలో వైదికానికి ముఖ్యమైన యజ్ఞయాగాదులు చేసిన శ్రోత్రియులుగాని, లౌకికానికి గౌరవప్రదమైన దివాన్‌జీ వుద్యోగాన్ని చేసినవాళ్లుగాని వున్నారని వ్రాసి సంతోషించడానికి నాకు లేశమున్నూ అవకాశం లేకపోయినా, సత్యసంధులు మాత్రం వున్నారని వ్రాసుకొని సంతోషించడానికి భగవంతుడు అవకాశం యిచ్చి వున్నాఁడని నన్ను ప్రేమించే లోకులకు తెల్పడానికే.


★ ★ ★