పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/799

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మవంచన

903


వాళ్లు చెప్పుకొని మా హిందువులలో, బ్రాహ్మణులలో, నియోగులలో, యిలాటి వారుండేవారని పొంగుతూ వుంటారు.

అన్నిటికన్నా ఆత్మవంచన చాలాకష్టం. అబద్ధం ఆడి పొందే గౌరవంకన్న నిజమాడి పొందే అగౌరవం అనేక రెట్లు మెఱుఁగని నేననుకుంటాను. నా కెప్పడున్నూ యీలాటిచిక్కు తటస్థింపలేదుగాని తటస్థిస్తే యిూలాగే వర్తిద్దామని చాలారోజుల నుంచి నా సంకల్పం. నా మాటేలా వున్ననూ మావంశంలో యీలాటి ప్రవర్తన కలవాళ్లు చాలామంది వున్నట్టు వినికి. మా నాన్నగారి ప్రవర్తన యిట్టిదే అని నేనెఱుఁగుదును. ఆయనకు శ్రుతపాండిత్యం తప్ప మంచి చెడ్డలు తెలిసికోవడానికి తగ్గ చదువు సంధ్యలు లేశమున్నూ లేవు. లేకపోయినా కవులలో చాలాభాగం ఆచారం యేలా వుంటుందంటే : మా నాన్నగారంత వారు, మా తాతగారంతవారు అని వ్రాసుకోవడం సర్వత్రా అనుభూతం. నాకు వంశాచారాన్ని బట్టో యేమో! ఆత్మవంచన చేసుకోవడం చేఁతకాక మాతండ్రిగారిని గూర్చి అతిశయోక్తిగా వ్రాయక “కామయ మనుమఁడు రామాంబకొమరుండు తండ్రి కామయ్య సత్యనిరతుండు" అని మాత్రమే వ్రాసి సంతుష్టిపడ్డాను. ఆయనే కాదు మా వంశంలో ముప్పాతిక మువ్వీసంపాళ్లు అంతా అమాయికులే అని మా బంధుజాత మేమి, మమ్మెఱిఁగిన తదితరులేమి నిర్వివాదగా అంగీకరిస్తారు. యీ అమాయికత్వాన్ని హాస్యం చేసే బంధువులు వెఱ్ఱిగా కూడా భావించి "చెళ్లపిళ్ల వెఱ్ఱి" అని కూడా వాడుతూవుంటారు. మా తండ్రులు ముగ్గురన్నదమ్ములు. ముగ్గురును అమాయికులే. అందులో మా తండ్రిగారే కొంత గడుసువారు.

లేక లేక యెన్నాళ్లకో నాకు సంతానం కలిగింది. ఆ చిరంజీవికి నాలుగేండ్లు దాటేరోజుల్లో మా తండ్రిగారు పరమపదించారు. ఆలోఁగా వకనాఁడు దంపుదంపే మనుష్యులు కాఁబోలును మా తండ్రిగారితో వారి మనుమణ్ణి గూర్చి, అయ్యా తాతగారూఁ మీమనుమఁడికి మీ పేరెట్టేరు కనక మీలాగే బతకాలండి అన్నారు. దానిమీఁద విని ఆయన ఊరుకో వచ్చునా? వూరుకోలేదు. నాలాగే సంచరిస్తే నాలాగే బతుకుతాఁడు పొమ్మని జవాబు చెప్పేఁడు. యింతకూ వ్రాసేదేమిటంటే ఆయన ఆత్మవంచించడం చేఁతకానివాఁడు కనుక సత్యసంధుణ్ణి అనే నమ్మకం ఆయనకి స్వవిషయంలో పూర్తిగా వుంది. సత్యసంధులకు పుణ్యలోకావాప్తి తప్పదని వేదశాస్త్రములు ఘోషిస్తాయి. యీ యేకాదశీమరణం పుణ్యలోకావాప్తికి మూలకారణంగా నిర్వివాదంగా అందఱూ వప్పుకుంటారు. ఆయన యెనభై మూఁడు వత్సరాల వయస్సులో అనాయాసంగా యేకాదశినాడు పరమపదించారు. ఆ పరమపదించడంలో కూడా కొంత విశేషం వుంది.