పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/798

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

902

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అసత్యాని కంగీకరింపఁ జేసినా అసలు దాని స్వభావం సత్యసంధత్వమే కనక తహశ్శీలుదారుగారి ముఖవైఖరిని బట్టియేమి, మాటల తబ్బిబ్బునుబట్టి యేమి, కేసు పూర్తిగా బిగిసింది. ధనమున్న చోటు కూడా బయటఁబడింది.

యిప్పటి అధికార్లకున్నూ అప్పటి అధికార్లకున్నూ చాలా భేదం వుంటుంది అని అందఱున్నూ వప్పుకొనే సంగతే కనక దాన్ని గుఱించి వేఱే వ్రాయనక్కరలేదు. విచారణాధికారి మన తహశ్ళీలుదారుగారి తండ్రి పేరు ప్రతిష్ఠలను గూర్చిన్నీ అసిధార వ్రతాన్ని గూర్చిన్నీ బాగా యెఱిఁగివుండడంచేత అతన్ని రప్పించి " మీ కుమారుణ్ణిగూర్చి మీరేం చెపుతా"రని సగౌరవంగా ప్రశ్నించాఁడు. దానిమీఁద మన తహశ్ళీలుదారుగారి తండ్రి యేలా చెప్పాలో అలాగ, ఆత్మవంచన లేశమున్నూలేకుండా వున్న దున్నట్లు ప్రేమపాశాన్ని తెగఁదెంపి పబ్లీకు న్యాయసభలో యేకరుపెట్టాడు. అధికారి ఆయన యథార్థ వాదిత్వానికిన్నీ నిష్పక్షపాతిత్వానికిన్నీ అత్యాశ్చర్య పడి ముక్కుమీఁద వేలెట్టుకొని నిర్ఘాంతపోయాఁడు. అబ్బా! యీ హిందువులలో యిలాంటి మహానుభావు లున్నారా అనుకొన్నాఁడు. అనుకొని యిందుకు ప్రతిఫలం మనం యేంచేయాలని అట్టే వితర్కించాఁడు. వితర్కించి, సరే! యితణ్ణి యేంచేయమంటారని మళ్లా ప్రశ్నించాడు. దానిమీఁద నిర్మొగమాటంగా నిర్దాక్షిణ్యంగా చెప్పేఁడుగదా ఆయన “రాజద్రోహికి యేం చేయవలసిందని ధర్మశాస్త్రం చెపుతుందో ఆ ప్రకారం చేయవలసిం” దన్నాఁడు దానిమీఁద అధికారికి మఱీ అనుగ్రహం పుట్టింది. పుట్టి మళ్లా అన్నాఁడుగదా “అయ్యా, మీ యథార్థవాదిత్వానికి నాకు చాలా ఆశ్చర్యమవుతూవుంది. యేమంటారా? లోకంలో దుర్మార్గుఁడైనా సరే, సన్మార్గుఁడైనా సరే, కొడుకంటే తండ్రికి అభిమానం వుండి తీరాలి. ఆ అభిమానాన్ని పట్టి ఆత్మను వంచించి యెంతటి అబద్ధమేనా ఆడితీరాలి. అట్టి సందర్భంలో గర్భవాసప్రీతిని లేశమున్నూ గణింపక నీవు ధర్మానికే కట్టుబడ్డావు. యిట్టి నిన్ను సంతోష పెట్టకపోతే భగవంతుడు నన్ను క్షమించడు. కాఁబట్టి నీ కోరిక యేదో చెపితే ఆ కోరికను నేను నెఱవేఱుస్తాను. సంశయింపక చెప్పవలసిం” దన్నాఁడు. దానిమీఁద మన కథానాయకుఁడుగారి తండ్రి, అయ్యా! నాయందుమీకట్టి అనుగ్రహమే నిశ్చయంగా కలిగినట్టయితే తప్పుచేసిన నా కొడుకు వుద్యోగం తీసివేసి పెన్‌షన్‌కూడా కొట్టేసి ఖైదుశిక్షలేకుండా మాత్రం వదలిపెడితే నన్ను మీరు సమ్మానించినట్టే సంతోషిస్తానన్నాఁడట ఆ మహానుభావుఁడు. దానిమీఁద అధికారి మనం యెంత జాఱవిడిచినా యీ పుణ్య పురుషుఁడు వున్న అవకాశాన్నంతనూ వుపయోగించుకోనేలేదని ఆశ్చర్యపడుతూ అదే ప్రకారం చేశాఁడఁట. అప్పటి నుంచీ ఆ తహశ్ళీలుదారుగారి తండ్రి చరిత్రను సత్యప్రియులైన