పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/796

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

900



ఆత్మవంచన

(11-4-1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

ఆత్మవంచన చేయడం కొంతమందికి చాలాతేలిక. అందుచేత ఆత్మవంచనను చాలామంది చేస్తూవుంటారు. యీ చేయడంలో అనేక సందర్భాలు వుంటాయి. కొన్నిటిలో భక్తి, కొన్నిటిలో మొగమాటం, కొన్నిటిలో భయం, కొన్నిటిలో ప్రేమ, కొన్నిటిలో కోపం, యిలాటివి హేతువులుగా వచ్చి ఆత్మవంచన చేయవలసివస్తుంది. వీటి నన్నిటిని గూర్చి వ్రాస్తే గ్రంథం చాలా పెరుగుతుంది. కాఁబట్టి దీనిలో ప్రేమ అనే ప్రబలకారణం వున్నప్పటికీ ఆత్మవంచనకు అంగీకరింపక యిహ పరలోకాలకు స్తోత్రపాత్రుఁడైన వక మహోద్యోగిని గూర్చి కొంత వ్రాస్తాను. పేరుపెట్టి వ్రాస్తే అదేంచిక్కో కనుక పేరుపెట్టకుండానే వ్రాస్తాను.

అనఁగా అనఁగా వక మహాపట్నం. ఆ పట్టణంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన వక ఆఱువేల నియోగుల కుటుంబము వుంది. ఆ కుటుంబంలో అనాదిగా సుప్రసిద్దులే బయలుదేరుతూ వచ్చారు. అందులో “వ్రతానా ముత్తమవ్రతం" అన్నట్టు వక మహాయోగజాతకుఁడు వుదయించాఁడు. ఆయన క్రమక్రమంగా పెద్దవాడై చదువు సంధ్యలు ముగిసిన తర్వాత వుద్యోగంలో ప్రవేశించి దినదినాభివృద్ధిగా శుక్ల పక్షచంద్రుఁడులాగ అఖిలజన ప్రేమప్రాతుఁడై కొంతకాలం వెలిఁగివెలిఁగి "పెన్‌షన్" పుచ్చుకొని సుఖంగా ఋషిప్రవర్తనతో జీవనం చేస్తున్నాఁడు. ఆయనకు నలుగురో అయిదుగురో కొమాళ్లు, అందఱికీ గొప్పగొప్ప వుద్యోగాలే తటస్థించాయి. అందులో వకకుమారుఁడు తహశీల్‌దారీ పెళపెళ్లాడిస్తూ వున్నాఁడు. ఆయనక్కూడా పెన్‌షన్ రోజులు సమీపానికి వస్తూవున్నాయి. ఆ కాలంలో "లంచంలేని మాటా పుంజంలేని బట్టాలేదు" అనే సామెత ననుసరించేవారే వుద్యోగస్థులలో నూటికి తొంభైమంది అని అందఱూ యెఱిఁగినదే. మన తహశ్శీలుదారు గారుకూడా కలియుగ రావణాసురుఁడు వంటివాఁడే కనుక లంచాలు విశేషించి పుచ్చుకొనేవుంటారు కాని యే కేసులోనూ చిక్కుకోకుండానే తెలివితేటలు కలవాఁడు కనక కాలక్షేపం చేసుకు రావడంచేత పై అధికార్లకు చిక్కవలసిన అవసరం లేకపోయింది. లక్షో రెండులక్షలో నిల్వచేశాఁడు. కాని పిల్లాజెల్లా బాధమాత్రం లేశమున్నూ లేదు. యిలాటి సందర్భంలో అంత ద్రవ్యం నిలవచేసి వున్నప్పుడు కొంత సంతృప్తి ఆయనకు వుండవలసిందే