పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“టీ-కాఫీ" వగైరా పానపదార్థాలు విక్రయించే దుకాణాలు వెలిశాయంటూ కొన్ని పత్రికలు సంతోషాన్ని వెలిపుచ్చాయి. కాని ఆ సంతోషం కొంత ఆపాతరమణీయంగా లేకపోలేదుగాని బాగా విచారిస్తే మన పూర్వజీవితానికిన్నీ మన ఆంధ్రదేశానికిన్నీ యివీ అనర్ధాపాదకాలే అవడంచేత- “ముల్లు వుచ్చి కొట్టడంచిన" చందమే అనుటకు సందేహంలేదు. కాని ప్రపంచదృష్టిలో మాత్రం యిది "గుడ్డిలో మెల్లగా కనబడుతుంది. అయితే యీ వుద్యమాన్ని నడిపేవారు దాక్షిణాత్యులు కావడంచేతనేమి, వారికి "కాఫీ-టీ" పానం అనుశ్రుతంగా వున్నదే అవడంచేతనేమి దీనికి వారు సంతోషించారంటే వింత కనపబడదు. మనదేశంలోకూడా యజ్ఞంలో శ్రాతులదగ్గిఱ నుంచిన్నీ సర్వదా సదాచారాలలో అసిధారావ్రతంగా సంచరించే వితంతువుల దగ్గిఱనుంచిన్నీ పితృకార్యాలలో నిమంత్రితులైన భోక్తల దగ్గిఅనుంచిన్నీ దీనికి అలవాటుపడి పవిత్రమైన దాన్నిగా భావిస్తూ వుండడంచేత విధిలేక దీనికి మన ఆంధ్రులున్నూ సంతోషించతగ్గదే. మొత్తం యీ కాఫీ-టీలుకూడా గృహసులకు వక విధమైన యీతిబాధలలోకే చేరతాయని నా వూహ. అయినా మద్యపానమంత బట్టవిప్పకొని నాట్యంచేయించే శక్తివీట్లయందు లేదు కనక తదపేక్షయా దీన్ని యీకాలంలో అంగీకరించక తీరదు. నల్లమందు అలవాటయినవాళ్లకు సమయానికి అది పడకపోతే కాళూ చేతులూ లాగడం వగయిరా దుర్గోషాలు బయలుదేటినట్టే యీ కాఫీ-టీలు కూడా సమయానికి పడకపోతే తలనొప్పి వగయిరా దుర్దోషాలు కనపడతాయని వారువారు అనుకుంటూవుంటే విన్నాను. నల్లమందు బాలవృద్ధాతురుల రోగాలకు మందుగా అనాదిగా మనదేశంలోనూ యితర దేశాలలోనున్నూ వాడుతూ వున్నవిషయం యెఱింగిన్నీ దాన్ని నిషేధింపC బూనినవారు తత్తుల్యమే అయిన దీన్నికూడా క్రమంగా నిషేధిస్తారనే వూహించాలి. యింక సబ్బునుగూర్చి మాట్టాడుకుందాం. పైపదార్ధాలలాగ యిది లోపలికి సేవించే దైతే కాదు గాని బీదలకు దీనివల్ల కొంత అనవసరపుఖర్చు కల్పిత మవుతూవుంది. నాలుగు కుంకుడుకాయలో, కాస్త సీకాయో వుపయోగించే దానికి పట్నాలు సరేసరి, ప్రతీపల్లెటూరు గృహసులున్నూ దీన్ని విశేషించి వాడుతూ వున్నారు. దీనిలోనూ సిగరెట్టులోలాగే అనేక రకాలు ఉన్నాయి. అందులో హెచ్చువెలకలవి యెన్నో వున్నాయి. ధనికులు ఆలాటివాట్లను తృణప్రాయంగా వాడి చాలా సొమ్మ వృథాచేస్తూన్నారు. కాని అది వారి కొకలక్ష్యంలోది కాదు– “పులినిచూచి నక్కవాంత పెట్టుకుందన్నట్టు పల్లెటూరి బీదలుకూడా ఆలాటి సబ్బులకే ప్రయత్నిస్తూన్నారు. ముఖ్యంగా వీట్ల అవసరం స్త్రీలకు. వాళ్లనాగరికత గడియకొకరీతిని మారుతూవుంది. పాశ్చాత్యుల భార్యలు నవనాగరికతకు తగ్గ వస్తువులు తేలేక యెందఱో బ్రహ్మచారులుగానే వుంటారని వినడం. ఆయోగం యీ కొత్తనాగరికతను అవలంబించే స్త్రీలవల్ల మనభారతీయులకుకూడా తారసిస్తుందని