పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/762

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

866

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వెళ్ళేము. అక్కడ శ్రీ గురువుగారు లేరు. మఱునాఁడే సభ కనుక దాని నిమిత్తం ఆహ్వానించడానికి పెద్ద మనుష్యుల దర్శనార్ధం నర్సాపురం దయచేశారు. ఈ స్థితిలో నన్నక్కడ చూచేవా రెవరు? “ఊరు నాకు క్రొత్త, ఊరికి నే క్రొత్త.” నేనా వూరు వెళ్లి అప్పటికి ముప్పైయేండ్లకు తక్కువ కాలేదు. భోజనంవేళ అప్పటికే దాటింది. అట్టిస్థితిలో మేము వెళ్లిన యింటి అరుగుమీఁద వక పిల్లవాఁడు పుస్తకం చేతఁబట్టుకు యేదో చూస్తూ కనపడ్డాడు. ఆ పిల్లవాణ్ణి పిలిచి ఫలానా శాస్త్రుల్లుగారి బస యెక్కడ అని అడిగాను. అప్పుడా పిల్లాడు నర్సాపురం వెళ్లారని చెపుతూ మీరెవరని అడిగేడు. ఫలానా అని చెప్పాను. వోహో సరే తమరేనా? కృష్ణమూర్తి శాస్త్రుల్లుగారు మీరు వస్తారని చెప్పి వెళ్లారు. ప్రొద్దుపోవడం చేత యీ వేళకు రారనుకొన్నారు మావాళ్లు. అని చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు. భోజనం చేశాము. ఆ వూళ్ళో దోమలబాధ విస్తారంగదా? అందుచేత పడుక్కోవడాని కెక్కడ కెడదామని ఆలోచిస్తూ వుండంగా వడ్డి శిష్యుఁడు వాళ్లవూరి కోమట్ల చుట్టా లీవూళ్ళో వున్నారు. వారి యింటికెడితే సదుపాయంగా వుంటుందన్నాఁడు. వెడదాం పదమన్నాను. రేపాక సర్వన్నగారనే వైశ్య శ్రేష్ఠుని యింటికి తీసుకొని వెళ్లాడు. ఆ దంపతులు చూపిన భక్తీ, గౌరవమూ వర్ణనాతీతము. భారతకృతికి సంబంధించిన శ్రీ రేపాక సత్యనారాయణగారున్నూ యీ సర్వన్నగారున్నూ దగ్గఱ జ్ఞాతులే. వారియిల్లు బసగా దొరకడంచేత ఆ వూళ్ళోవున్న మూఁడు నాల్గు రోజులున్నూ స్వగ్రామంలో స్వగృహంలో వున్నట్లే వుంది. ఇంతేకాక ఆ వూరి శివాలయపు అర్చకులు వెల్నాటి పూజార్లు శ్రీ శివకోటి సుబ్బయ్యగారు కూడా నన్ను మిక్కిలిగా ఆదరించారు. ఈ కారణంవల్ల కూడా వార్ధక్యదోషం అప్పుడే తొక్కికొని వస్తూవున్నప్పటికీ నాకు లేశమున్నూ ఇబ్బంది అనిపించనేలేదు.

వెళ్లిన మఱునాఁడే విష్ణ్వాలయంలో భారతకృతి సమర్పణం. యీ పని ఉదయం సుమారు పదిగంట్లకు లోఁగానే. యీలోపున గ్రంథకర్తగారిని వూరేగించడం, గురువుగారు తమతోపాటు నేను కూడా సారటులో వుండాలని బలవంతపెట్టారు. కాని నల్లమందు వేస్తేనే కాని నేను వకరి అధీనంలో వుండే యేపనికిన్నీ పనికిరాను. అందుచేత రాలేనని మనవి చేసుకున్నానుగాని అంగీకరించారుకారు. యేం రసాభాసవుతుందో అని భయపడుతూ నల్లమందు వేసుకోకుండానే వూరేగింపులోకి నేను కూడా వెళ్లి గురువుగారితోపాటు సారటులో కూర్చున్నాను. పాలకొల్లు రావలసిందని గురువుగారు నాకు కబురుచేసిన తర్వాత వారిని నేను సావకాశంగా కలుసుకొన్న దప్పుడే. రాత్రి రెండుగంటల వేళ గురువుగారు నర్సాపురాన్నుంచి వచ్చి నన్ను కలుసుకొన్నారు గాని అప్పుడు వట్టి క్షేమసమాచారమేగాని యితర ప్రసంగమేమీ జరగనే లేదు. వూరేగింపులో సారటులో కూర్చున్నది మేమిద్దరమే కనుక యేదేనా మాట్లాడుకోడానికి అవకాశం చిక్కింది.