పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/761

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది865నా పాలకొల్లు ప్రయాణము

(15 - 2 - 1936 సం||ర కృష్ణాపత్రిక నుండి)

స్వస్తిశ్రీ ప్రభవ సం|| జ్యేష్ఠ శుద్ధంలో నాకు హఠాత్తుగా పాలకొల్లు ప్రయాణం తటస్థించినది. అప్పటికి పూర్వం సుమారు సంవత్సరంన్నర నుంచి జబ్బుగా వుండి వుండి రమారమీ నాలుగుమాసాల నుండి కాఁబోలు కొంత వ్యాధి తీవ్రస్థితి తగ్గి యింటిలో మట్టుకు సుళువుగా వుండఁగలుగుతున్నాను. అంతేనేకాని చొరవచేసి యే వూరికిఁగాని వెళ్ళే స్థితి యింకా అప్పటికి రాలేదు. అట్టి స్థితిలో శ్రీ మా గురుపరంపరలో నొకరగు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రులవారు చిన్న రుక్కాముక్క నొకదాన్నిచ్చి శ్రీయుత బాలదారి వీరనారాయణదేవుగారిని నా యొద్దకు పంపించారు. ఆ రుక్కాముక్కలో నిట్లుంది. "నేను పాలకొల్లు వెడుతూ వున్నాను. నీవు తప్పక రావలెను. నీవు వచ్చుటవల్ల నాకు యినుమిక్కిలిగా లాభించును" అని. యిట్లుండడమంటే యీ అక్షరాలే అన్నమాట కాదు. యీ అర్థం వచ్చే మాట లున్నాయన్నమాట. గురువుగా రప్పుడు పాలకొల్లు వెళ్లే ప్రసక్తి యేలాంటిదో శ్రీ నారాయణదేవుగారు నాతో చెప్పినారు. వారు భారతకృతి సందర్భంలో పాలకొల్లుకు వెళ్లారు. నేను వారి సెలవు ప్రకారం వెళ్లడానికి తగ్గంత ధైర్యంగా లేను. మంచిస్థితిలో వున్నప్పుడేనా నేనేదేనా పొరుగూరికి వెళ్లవలసివస్తే యెన్నో ముహూర్తాలూ, ఆనందాదియోగాలూ వగయిరాచూచికాని బయలుదేరే ఆచారంలేదు. అట్టిస్థితిలో సుస్తీగావున్నప్పుడు వెంటనే బయలుదేరడ మంటేయోట్లా? అదిగాక, ఆవేళ నవమి కూడాను. ప్రయాణనవమీ, ప్రత్యక్షనవమీ కూడదని పెద్దలంటారు. పైగా గురువారం కూడాను. “న గురౌ దక్షిణాం దిశం" అన్న నిషేధం సుప్రసిద్ధమేకదా? యిన్ని అసందర్భాలున్నప్పటికీ గురువుగారి మనస్సుకు వెళ్లకపోతే నొప్పి కలుగుతుందేమో అని బయలు దేరడానికి నిశ్చయించుకొన్నాను. కాని నేను వెళ్లడంవల్ల గురువుగారేదో తమకు లాభం కలుగుతుందని వ్రాసినమాటకు మాత్రం నాకు అర్థం బోధపడిందికాదు. సరే అక్కడికి వెళ్లిన తరువాత గురువుగారినే కనుక్కుందామని అనుకున్నాను. వడ్డి శిష్యుఁడు నందివాడ వెంకటరత్నానికి ఆవూళ్ళో చుట్టా లుండడంచేత అతఁడు కూడా వస్తానన్నాడు. చిరంజీవి నా రెండవ కుర్ర దుర్గయ్యనీ, పైనిచెప్పిన వడ్డీ అతణ్ణీ వెంటఁబెట్టుకొని పాలకొల్లు ప్రయాణం చేశాను. రాత్రి తొమ్మిదిగంటల సుమారువేళ మోటారుదిగి వారినీ వారినీ అడుగుతూ గమ్యప్రదేశానికి