పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/763

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా పాలకొల్లు ప్రయాణము

867


అప్పుడు “అయ్యా! తాము నాకు వ్రాసిన రుక్కాలో నీవు వస్తే నాకు మిక్కిలిగా అనఁగా యినుమిక్కిలిగా లాభిస్తుందని వ్రాసినారు గదా! ఆ సందర్భం యెట్టిది, యిక్కడ నేను ఆ లాభించే విషయంలో యేం చేయవలసి వుంటుంది" అని అడిగేను. ఎంత గుచ్చి గుచ్చి అడిగినా గురువుగారు దీన్ని గుఱించిన మార్గం చెప్పినట్లే లేదు. అప్పుడల్లా వుండఁగా యిప్పటికీ నాకా విషయం పుస్తకాపేక్షే వూరేగింపులో నాకు వారు చెప్పిన సంగతల్లా, ఆ కృతిని స్వీకరించే వైశ్యశ్రేష్ఠుని ఆరోగ్య భాగ్యభోగ్యాలు తప్ప వారు వ్రాసిన విషయంలో నాకు కల్గిన సంశయాన్ని నివర్తించేమాట వకటిన్నీ చెప్పనేలేదు.

వూరేగింపు ముగిసింది. పెట్టుకొన్న సుముహూర్త ప్రకారము భారతంలో రెండవ సంపుటం కాఁబోలును సభలో యేవో కొన్ని పద్యాలు కృత్యాదివి వినిపించి అంకితం యిచ్చే ఆచారాన్ని లఘువుగా నిర్వర్తించారు. అప్పుడు నేను కూడా ఆ భారత భాగంలో కృత్యాదివో మఱో భాగంలోవో కొన్ని చదివినట్లు జ్ఞాపకం. కృతినందికొనే ఆయన సభార్యకంగా పీటలమీద కూర్చుండి వైదికాచార ప్రకారముగా కృతిని స్వీకరిస్తూ శ్రీ శాస్త్రులవారికి అదివఱలో ప్రతిశ్రుత మొనర్చిన ద్రవ్యాన్ని నూతన వస్తాలసహితం చందనతాంబూలాలతో సహా పళ్లెంలో వుంచి సమర్పిస్తూ, యిచ్చే భూమిని కూడా వాచా యింత అని చెప్పి సమర్పించాడు. తరువాత మహదాశీర్వచనంతో అప్పటికి సభ ముగిసింది. యెవరిండ్లకు వారు భోజనాల కెళ్ళేరు.

యిఁక మధ్యాహ్నం గురువుగారి భారత ప్రశంసను గుఱించిన సభ. ఆ సభలో శ్రీనాళం కృష్ణారావుగారు, బాలవారి నారాయణదేవుగారు, మఱికొందఱు ప్రాజ్ఞులున్నూ వుపన్యాసకులు. నేను ఆఖరు వుపన్యాసకుణ్ణి. శ్రీ నర్సాపురం సబ్‌జెడ్జిగారు అధ్యక్షులని జ్ఞాపకం. శ్రీ నాళం కృష్ణారావుగారు మొదలైన వుపన్యాసకులు శ్రీకృష్ణభారతాన్ని గుఱించి విపులంగా వుపన్యసించిన తరువాత నా వంతు వచ్చింది. నేను నాకు పూర్వం ఉపన్యసించినవారి అభిప్రాయంతో పూర్తిగా యేకీభవిస్తున్నానని చెప్పుతూ నాకు తోచిన మఱికొన్ని సంగతులు చెప్పి ప్రస్తుతాన్ని బలపఱిచాను. అంతలో సభ్యులలో యెవరో కవిత్రయ భారతాన్ని గుఱించి అడిగినట్లున్నూ, దాన్ని గుఱించి ప్రస్తుతం యెత్తితే తేలదని బదులు చెప్పినట్లున్నూ తరువాత వారి కోరికమీఁదనో లేక స్వంతంగానో గద్వాలాది సంస్థానముల విషయం కొంతసేపు చెప్పి నా పుపన్యాసాన్ని ముగించినట్లున్నూ జ్ఞాపకం. నా వుపన్యాసం ముగించేటప్పటికి రాత్రి తొమ్మిదిగంటలకు తక్కువ కాలేదు. నర్సాపురాన్నుంచి పలువురుద్యోగస్థులు వచ్చి యుండుటచే కొంత త్వరలో యెత్తుకొన్న విషయాన్ని ముగించినట్లు సభ్యులకు తోచింది. అందుచేతే కాఁబోలును నర్సాపురపువారు