పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

864

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

ఇఁక ముగిస్తాను. చదువరు లొక సంగతిమాత్రం కనిపెడుతూండాలి. నాది శిష్యస్థానం. కనుక యే మాత్రమున్నూ వ్రాఁతలో దుందుడు కుండడానికీ లోకమున్నూ వప్పుకోదు, శాస్త్రమున్నూ వప్పుకోదు. కాఁబట్టి యేమాత్రం అవక తవకగా వున్నట్టు మీకు తోఁచినా వెంటనే తెల్పుతూ మందలించుటకు మీ కధికారం పూర్తిగా వున్నదన్న సంగతి నేను వేఱే తెల్పనక్కఱలేదు. అఱవైయాఱేండ్ల వయస్సులో వున్న నేను యిప్పటికి యే దోషమున్నూ చేయలేనేలేదని చెప్పనూలేను, చెపితే లోకము విశ్వసించనూ విశ్వసించదు. యింకేమిటంటే నా ధైర్యం, కృతఘ్నత్వం మాత్రం నేనెప్పుడు కలలో కూడా యెఱుఁగనని నా నమ్మకం. అందుచేత యింత దీర్ఘవ్యాసం అసమర్థస్థితిలో దినదినగండం వేయేళ్లాయుష్యం అన్నట్టుగా వుండి కూడా వ్రాస్తినిగాని, వ్రాసే శక్తి వుండి మాత్రం కాదు. లోకుల యెదుట, వున్న యథార్థాన్ని పడవేయకపోతే యీ అపవాదుతో నే పరానికి వెళ్లవలసి వస్తుందేమో అని నాకు భయం. సామాన్యు లారోపించిందైతే గణింపవలసి వుండదుగాని యిది అట్టిది కాదని వేఱే చెప్పనక్కఱలేదు. కొల్లాపురం గొడవకు పూర్వం గురువుగారు నన్నుఁగూర్చి యెవరైనా యేమేనా అంటే వాళ్లని కొట్టడానిక్కూడా సంసిద్దు లయ్యేవారని నేనెఱుఁగుదును. యీ కొంపతీఁతకు ఆగోల కారణమయింది. కొద్ది గొప్ప నా తెల్వితక్కువ కూడా వున్నట్లు తెల్పేవున్నాను. యథార్థమైనా నేను వారికి వ్యతిరేకంగా వ్రాయకూడదు. అయితే మాత్రం నన్ను మఱోలాగు మందలించాలనికాని అపవాద ఆరోపించడం న్యాయమా? కానివ్వండి, యిది కూడా నాకు కొంచెం వుపకారమే చేసింది. ఇదే లేకపోతే నా యితర ప్రయాణాలవలె టూకీగా జాతకచర్యలో వుదాహరించినదానితో తేలిపోక కాశీయాత్రవలె దీనికి ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేయడం తటస్థించదుకదా! దీనివల్లనేకదా యెన్నాళ్లనుంచో శ్రీ ముక్త్యాల రాజావారి దాతృత్వాన్ని గుఱించి వ్రాయాలనుకుంటూవున్న నామనోరథం సఫలం అయింది. కాఁబట్టి గురువుగా రాపాదించిన అపవాదుకూడా నాకు కొంతలాభాన్నే కలిగించినదని సంతోషిస్తూ దీన్ని ముగిస్తాను.

★ ★ ★