పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

863


నా విషయంలో యెన్ని విధాల సహాయం చేశారో కొంచెం వ్రాయడానికి శ్రీమా గురువుగారు కారణభూతు లవడంవల్ల వారికి పునఃపునః నమస్కరిస్తున్నాను. గురువుగారిటీవల నిన్న మొన్నటి నుంచి నన్ను గుఱించి యేలా వ్రాసినా, నా యందు మిక్కిలీ పక్షపాతం గలవారనుటకు సందేహంలేదు. నేను కాటవరంలో వీరివద్ద చదువుకునేటప్పుడు కేవలంగా నన్ను కుమారునికంటే కూడా యినుమిక్కిలిగా చూడడం నా కిప్పటికిన్నీ జ్ఞప్తిలోవుంది. దాన్ని గూర్చి యిప్పుడు వ్రాస్తూవున్న "ఇటీవలి చర్యలో" కూడా వ్రాశాను. చూడండి.

ఉ. ఆయనయొద్దనేరిచితి, నన్యులయొద్దనుగూడ నేర్చితిన్
    "పోయెను కాలమద్ది" యనఁబోలెనె? నేఁడు ప్రయోజకుండనై
     ఆయెడఁ బుత్రుకన్న నధికాదృతిఁ జూచిన చూపు నెమ్మదిం
     బాయద నాకు నిప్పటికిఁ బాండితి యెంతటిదేని గల్గినన్.

నానాఁటి కిప్పటికాలానికి యేలాగ మాఱినా, మనలో గురుశిష్య భావమనేది చాలా కట్టుబాటులో వుండేది. చూడండి, ఆయుధాలు ధరించి వొకరి నొకరు చంపుకొనే ప్రయత్నంలో వున్నప్పుడు కూడా భారతయోధు లెట్లు వర్తించారో!

(ఇటీవలి చర్య నుండి)

తే.గీ. అర్జునుఁడు కృపునొద్ద ద్రోణార్యునొద్ద
       శంకరునియొద్దఁగూడ నస్త్రములు నేర్చె
       నిందెవరియందు గౌరవ మించుకేని
       యేమఱెనె? భారతార్థజ్ఞులిది యెఱుఁగరె

సాక్షాత్తుగా గురుత్వమే వుండనక్కఱలేదు. పరంపరాగురుత్వాన్ని కూడా మనవారు గణించేవారు. దీన్ని గుఱించి కొలఁది సంవత్సరాల క్రితం జరిగిన వక యితిహాసం "ఇటీవల చర్య" లో వుదాహరించాను. ఆ సందర్భాలలోది కూడా వక పద్యం యిక్కడ చూపుతాను.

క గురుశిష్యభావ మియ్యది
   పరంపరాప్రాప్త, మింకఁ బ్రస్తుతమగు మా
   గురుశిష్యత సాక్షాత్తుగ
   జరిగిన దిది కాదనంగ శంకరు తరమే.