పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా ముక్త్యాల ప్రయాణము

861

మొత్తం తేలిన సారమేమిటంటే, యీ విషయంలో నిజమైన, దాతకు ఆనందం వుంటుందనిన్నీ కొంచెం వ్యక్తికల ప్రతిగృహీతకో, సంకోచంగా వుంటుందనిన్నీ సహృదయులు గ్రహిస్తారు. ప్రస్తుతానికి వద్దాం. నిరంతరమున్నూ ప్రతిగ్రహమే చేయుచుండడ మట్లుండ, దానికై పుట్టిన బ్రాహ్మణవంశమందు జన్మించిన నాకు శ్రీ ముక్త్యాలరాజావారి దాతృత్వము సందేహాన్ని కల్గించింది. చల్లపల్లిరాజావారు చాలయెక్కువ ధనమిచ్చినా, సంశయం లేకుండానే ప్రతిగ్రహించాను. వీరిచ్చిన దంతకన్న తక్కువైనా ప్రతిగ్రహించి సిగ్గుపడినాను. ఎందుచేత? ఇప్పటికి సుమారు సంవత్సరన్నఱనాఁడు శుభలేఖ పంపినంత మాత్రాన రెండు నూటపదహారులు మనియార్డరు పంపె, మళ్లా యిప్పుడు నూటపదియాఱు లిచ్చె, పెద్దరాబడిగల అనేక జమీందార్ల యీవికంటె యీ యీవి నా కెందుచేతనో ఆశ్చర్యం కలిగించింది. పోనీ చేతనైన పనిగదా, ఏవో కొన్ని పద్యాలు చెపుదామంటే ద్రవ్య మిచ్చినప్పుడు చెప్పిన పద్యాల కంత విలువయుండదనిన్నీ సంశయం కలిగింది. ఎప్పుడూ నీ వాలాటి పద్యాలే చెప్పనేలేదా? అంటే : చెప్పకేంగాని, యేదో వున్నంతలో కాస్తయుక్తా యుక్తం విచారిస్తూండడం మాత్రం వుంది. అంతేకాని చెప్పకుండా యొక్కడ నెఱవేఱింది? తుట్టతుదకు శ్రీ ముక్త్యాలరాజావా రొసఁగిన నూటపదహార్లు గ్రహించిన తర్వాత కూడా యెదుటనేమీ చెప్పలేదుగాని, యేమైతే అదయిందని యీ క్రింది పద్యాలు చెప్పి పంపించాను. యివికూడా అచ్చైయున్నప్పటికీ ప్రసక్తి కలగడంచేత ఇక్కడ ఉదాహరిస్తాను.

మ. నృపతు ల్లేరని కాదుగాని మఱి ముక్తీలేశ ! నీవంటి దా
     నపరుల్ మృగ్యులు, నాఁడు నీ పురమునన్ సన్న్యాసికిన్ భక్తిమై
     నుపచారమ్ములొనర్చు నుత్సవమునం దోహో ! భవత్పాణి ప
     ద్మపు సౌభాగ్యము నేమిచెప్పవలెఁ దత్తద్దానముల్ సేయుచో. - 1

మ. ఎవరో మస్కరి వచ్చెనే యనుము మీ కృష్ణాస్రవంతీ తటం
     బవలోకింప; నమస్కరించియు సపర్యల్ జల్పినం జాలుఁగా!
     కవులన్ గాయకులన్ దదన్యులను వేడుం బిల్వఁగా నేల? త
     ద్వ్యవసాయమ్మునకంత యీవి యిడనేలా? చంద్రమౌళీశ్వరా - 2

మ. అది నీవెప్డు పఠించితో తెలుపుమయ్యా నాకు, నాముక్తమా
     ల్యదలో వ్రాసెను గృష్ణరాయలు మహౌదార్యస్వరూపంబు, నీ
     కదియుం గాదనుకార్య, మాతఁడు భవిష్యద్వేత్తయై వ్రాసెనం
     చెదనూహింతు భవద్వదాన్యతకు నీ డెచ్చోట నేఁగానమిన్. - 3